Friday, November 22, 2024

Spl Story | క్యాహువా కామ్రేడ్స్..​ ఆ కూటమితోనే బీఆర్​ఎస్ దూరం దూరం!

తెలంగాణలో బీఆర్​ఎస్​, కమ్మూనిస్టులు కలిసి పోయారు.. రాబోయే ఎన్నికల్లోనూ పొత్తులుంటాయని అంతా భావించారు. సీపీఎం, సీపీఐతో ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్ కూడా​ భావించారు. మునుగోడు ఎన్నికల్లో వారితో చర్చలు జరిగాయి. కామ్రేడ్స్​ కలిసిరావడంతో మునుగోడులో గెలుపు బీఆర్​ఎస్​కు ఈజీ అయ్యింది. కానీ, ఆ తర్వాతే పరిస్థితులు బెడిసికొట్టాయి. కామ్రేడ్స్​ తీసుకున్న ఓ నిర్ణయం బీఆర్​ఎస్​కు దూరం చేసింది. విపక్ష పార్టీలన్నీ కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడడం, అందులో ఇరు కమ్యూనిస్టు పార్టీలు ఉండడంతో బీఆర్​ఎస్​ వారిని దూరం పెట్టినట్టు తెలుస్తోంది.

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

అవును.. తెలంగాణలో ఒకప్పుడు ఊరూరా రెపరెపలాడిన ఎర్రజెండా ఆ తర్వాత వెలిసిపోవడం మొదలయ్యింది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఆ పార్టీల మూలాలు ఉన్నప్పటికీ కార్యకర్తలను ఆదరించి, ముందుకు నడిపించే నాయకత్వం లేదు. సిద్ధాంత రీత్యా కూడా మార్పులు చేసుకోకపోవడంతో వారితో కలిసిరావడానికి జనం అంతగా ఇష్టపడడం లేదు. ఇప్పటికీ కూలీ పోరాటాలు, గ్రామాస్థాయి ఆందోళనలు చేస్తూ జనాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నా.. ఎన్నికలు వచ్చేసరికి కమ్యూనిస్టు పార్టీలకు అంతగా ఓట్లు పడడం లేదు.

కొంతమంది అనలిస్టులు చెప్పుకొచ్చేదేమిటంటే.. ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం ఏలిన నోకియా ఫోన్లు.. ఆ తర్వాత స్మార్ట్​ యుగంలో అప్​డేట్​ కాకపోవడంతో వాటి ప్రాభవం కోల్పోయాయని, రోజు రోజుకూ కొత్త మార్పులు, అప్​డేట్స్​తో ముందుండే కంపెనీలే జనాల ఆదరణ పొందుతున్నాయని, అట్లాగే.. సీపీఎం, సీపీఐ కూడా పరిస్థితులకు తగ్గట్టు అప్​డేట్​ కాకపోడంతోనే ప్రజల్లో ఆదరణ కోల్పోయాయన్న విశ్లేషణలున్నాయి.

- Advertisement -

అయితే.. ఇట్లాంటి వాటిని కరుడుగట్టిన కమ్యూనిస్టు భావాలున్న వారు కొట్టిపారేస్తుంటారు. తాము చెప్పిందే వేదం అన్నట్టుగా ప్రజలు వారి భావజాలాన్ని నమ్మకున్నా.. వారు పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టు వ్యవహరిస్తుంటారు. అయినా.. కమ్యూనిస్టు పార్టీల సిద్ధాంతం, ఆలోచనా ధోరణి మారకుంటే ఇక ఆ పార్టీల మనుగడ కష్టం అనే స్థితికి వచ్చినా.. ఆ పార్టీల్లో మార్పు రావడం లేదన్నది నేటి పరిస్థితులే తెలియస్తున్నాయి.

ఇక.. తెలంగాణలో ఎన్నికల విషయానికి వస్తే.. 119 నియోజకవర్గాలకు గాను 115 చోట్ల అభ్యర్థులను ప్రకటించి బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ సంచలనం సృష్టించారు. కానీ, తమతో కలిసి పోటీచేద్దామనుకున్న విషయాన్ని కమ్యూనిస్టులు ప్రస్తావించడంతో ఒకింత వారిపై, వారి సిద్ధాంతాలపై కేసీఆర్​ సీరియస్​ అయినట్టు తెలుస్తోంది. ఇండియా కూటమిలో ఉన్న మీతో ఏ కూటమిలో లేని తాము ఎలా పొత్తు పెట్టుకుంటామని.. ఇండియా కూటమి నుంచి బయటికి వస్తే తప్పకుండా పొత్తుల విషయం ఆలోచిస్తామని సీరియస్​గా చెప్పినట్టు సమాచారం. కాగా, ఈ విషయంలో కమ్యూనిస్టుల నుంచి ఎట్లాంటి ఆన్సర్​ లేదని, తామేమీ చేయలేని స్థితిలో ఉన్నట్టు రాష్ట్ర నాయకత్వం చెప్పినట్టు సమాచారం.

అందుకని ఇరు కమ్యూనిస్టు పార్టీలు పొత్తుల విషయం ఎత్తకుండా గమ్మునుండడానికి ఇదే ప్రధాన కారణమని, లేకుంటే రచ్చ రంబోలా చేసేవారని పరిశీలకులు అంటున్నారు. అయినప్పటికీ ఇవేమీ తెలియని వారు మునుగోడు ఎన్నికను ప్రస్తావిస్తూ.. కమ్యూనిస్టులను వాడుకుని సీఎం కేసీఆర్​ ఆ తర్వాత పొత్తు పెట్టుకోకుండా కరివేపాకులా తీసేశారని విమర్శలు చేస్తుండడం వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. ఏది ఏమైనా బీఆర్​ఎస్​ అధినేత ఎవరినీ కాదనకుండా, తమతో కలిసి వచ్చే వారితో కలిసిపోయే ధోరణితోనే ఉన్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement