Wednesday, November 20, 2024

ప్రత్యేక హోదాపై కుంటిసాకులు.. రుణ సేకరణ పరిమితిపై ఆంక్షలొద్దు: విజయసాయి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పేవన్నీ కుంటిసాకులేనని వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజ్యసభలో సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించకుండా కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. ముందుగా కేంద్ర ప్రభుత్వం సాధించిన పలు విజయాలు, ప్రాథమ్యాలను వివరిస్తూ పార్లమెంట్‌ ఉభయసభలును ఉద్దేశించి చేసిన ప్రసంగానికి రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తరఫున రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతూ విజయసాయి రెడ్డి తన ప్రసంగం ప్రారంభించారు. నికర రుణ సేకరణ పరిమితిని తగ్గించడం రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనమని అన్నారు.

అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తడం లేదని ప్రతిపక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తమ పార్టీని ఆడిపోసుకోవడం దినచర్యగా మారిందని అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ ప్రధానమంత్రితో 7 సార్లు, హోంమంత్రి అమిత్‌ షాతో 12 దఫాలు సమావేశమయ్యారని, ప్రతి సమావేశంలోనూ ప్రత్యేక హోదా అంశాన్ని ముఖ్యమంత్రి లేవెనెత్తారని విజయసాయి తెలిపారు. ఇటీవల తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులోనూ అమిత్‌ షా వద్ద ప్రత్యేక హోదా అంశాన్ని లెవనెత్తారని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అంశంపై చర్చకు గత పార్లమెంట్‌ సమావేశాలలో వాయిదా తీర్మానం ఇచ్చి తక్షణమే చర్చకు అనుమతించాలంటూ ఉభయ సభలను అనేక రోజులపాటు స్తంభింపజేసిన విషయాన్ని విజయసాయి ప్రస్తావించారు. ప్రత్యేక హోదా నిరాకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఆరు కారణాలు చెబుతోందని, అవన్నీ కేవలం కుంటి సాకులు, నిర్హేతుకం, అన్యాయమైనవని విజయసాయి మండిపడ్డారు.

రాష్ట్ర విభజన చట్టం రూపకల్పనలో ఉన్న అనేక లొసుగులను కేంద్ర ప్రభుత్వం అవకాశంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను నిరాకరిస్తోందని వాపోయారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే విభజనకు గురైన జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, చత్తీస్‌ఘడ్‌ వంటి ప్రతి రాష్ట్రం ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని… ఆనాడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజించిన ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలేవీ తమ రాజధానిని కోల్పోలేదని ఆయన అన్నారు. రాజధానిని కోల్పోయిన తమకు హోదా ఇస్తామని ప్రధానే హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని సాక్షాత్తు నాటి ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ప్రకటించిన విషయం వాస్తవం కాదా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

ఆర్థిక వెనుకబాటు నాటి ప్రధానికి తెలియదా?
ఆర్థిక ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే వెనుకబడిన ఒడిషా, బీహార్‌ రాష్ట్రాలు కూడా హోదా కోసం డిమాండ్‌ చేస్తాయని కేంద్రం కారణంగా చూపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ఒడిషా, బీహార్‌ ఆర్థికంగా వెనుకబడిన విషయం అప్పుడు హామీ ఇచ్చిన మన్మోహన్‌కు తెలియదా అని ప్రశ్నించారు.

విభజన చట్టంలో లేని ప్రత్యేక హోదా
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ఎక్కడా ప్రత్యేక హోదా ప్రస్తావనే లేనందున హోదా మంజూరు చేయలేమని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, ఉత్తరప్రదేశ్‌ నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని ఉత్తరప్రదేశ్‌ విభజన చట్టంలో ఎక్కడా ప్రస్తావించకపోయినా ఆ రాష్ట్రానికి హోదా ఎలా కల్పించారని విజయసాయి రెడ్డి కేంద్రాన్ని నిలదీశారు. బీజేపే పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, బీజేపీయేతర రాష్ట్రాలకు మరో న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు.

- Advertisement -

ప్రత్యేక హోదా సాధ్యపడదు
ప్రత్యేక హోదా అనేది రాజకీయంగా సాధ్యపడదంటున్న కేంద్రం 2021లో జరిగిన పాండిచ్చేరి ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోలో తమ పార్టీ అధికారంలోకి వస్తే పాండిచ్చేరికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఎలా హామీ ఇచ్చిందని విజయసాయి నిలదీశారు. ప్రత్యేక హోదా అనేది బీజేపీకి రాజకీయ అంశం కావచ్చు గానీ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు అది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని ఆయన స్పష్టం చేశారు.

హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ
ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రానికి భారీఎత్తున వచ్చే పెట్టుబడుల ద్వారా జరిగే పారిశ్రామీకరణతో కలిగే ప్రయోజనాలు కొద్దిపాటి ఆర్థిక సాయంతో పోల్చుకుంటే ప్రత్యేక ప్యాకేజీ ఏమూలకు పనికి రాదని విజయసాయి స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి నాటి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘోర తప్పిదానికి పాల్పడ్డారని, ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ప్రజాపోరాటాన్ని ఆయన నీరుగార్చేశారని విమర్శించారు.

హోదా ఇవ్వమని చెప్పని 15వ ఆర్థిక సంఘం
గాడ్గిల్‌ కమిటీ నివేదికను ప్రస్తావిస్తూ 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి అంగీకరించలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, ఆర్థిక సంఘం సిఫార్సులను యథాతధంగా అమలు చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదనే విషయాన్ని భారత రాజ్యాంగం కూడా స్పష్టంగా వివరించిందని విజయసాయి అన్నారు. ఆర్టికల్‌ 280 (2) ప్రకారం సిఫార్సులను రాష్ట్రపతికి సమర్పించడం మాత్రమే ఆర్థిక సంఘం విధి అని రాజ్యాంగం చెబుతోందనే విషయాన్ని 15వ ఆర్థిక సంఘం కూడా తన నివేదికలో స్పష్టం చేసిందని ఆయన చెప్పారు.

ఏపీకి హోదా ఇవ్వాలని కమిటీ సిఫార్సు
ఆంధ్రప్రదేశ్‌తోపాటు విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన చత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలని కామర్స్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ తన 164వ నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని విజయసాయి రెడ్డి వివరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు మాని ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

నికర రుణ సేకరణపై ఆంక్షలు వద్దు
ఆంధ్రప్రదేశ్‌ నికర రుణ సేకరణ పరిమితిని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు నాయుడు హయాంలో తెలగుదేశం ప్రభుత్వం పరిమితికి మించి చేసిన అప్పులు, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వంటి తప్పిదాలకు ఇప్పుడు తెలుగు ప్రజలను శిక్షించడం తగదని విజయసాయి రెడ్డి అన్నారు. పరిమితికి మించి రుణాలు తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం శిక్షించాలనుకున్నప్పుడు దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో రుణ పరిమితి కంటే తక్కువగా రుణాలు పొందిన వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుని ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మినహాయింపు ఇవ్వాలని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం కంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంత మెరుగ్గా ఉందో గణాంకాలతో సహా విజయసాయి వివరించారు. 2019-20లో కేంద్ర ప్రభుత్వంలో ద్రవ్యలోటు 4.6 శాతం ఉంటే, ఏపీలో అది 4.1 శాతం ఉంది. 2020-21లో కేంద్రంలో లోటు 9.2 శాతం ఉంటే ఏపీలో అది 5.4 శాతం ఉంది. 2021-22లో కేంద్రంలో ద్రవ్యలోటు 6.9 శాతం ఉండగా ఏపీలో 3.5 శాతం ఉందని చెప్పారు. ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌ నికర రుణ సేకరణ పరిమితిపై విధించిన ఆంక్షలను తొలగించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement