కుల గణన పై ఆరు రాష్ట్రాలు తీర్మానం చేశాయని, 20 రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి అని బీసీ నేత,సినీ నటుడు సుమన్ తెలిపారు. వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు ఢిల్లీకి వెళ్లి, కేంద్రానికి బీసీల హక్కులను తెలియజేయాలని అన్నారు. బీసీల అంటే కేంద్రానికి లెక్క లేకుండా పోయిందని, కుల గణన ఇప్పటికే చాలా ఆలస్యమైందని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం కుల గణన చేయకపోతే జనగణనను బహిష్కరిస్తామన్నారు.
తమ డిమాండ్ ను నెరవేర్చకుంటే డిసెంబర్ లో పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు. కుల గణనను చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు నుంచి కాణిపాకం వరకు పాదయాత్ర చేపట్టారు. ఒకపక్క జోరువాన కురుస్తున్నా.. బీసీలు ఐక్యంగా ఉండి.. యాత్రను జయప్రదం చేశారు. ఈ పాదయాత్రలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్ రావు, జిల్లా అధ్యక్షులు జ్ఞాన జగదీష్, నాయకులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.