Tuesday, November 26, 2024

మెడ్‌టెక్‌ హబ్‌గా తెలంగాణ, స్టెంట్‌ తయారీ యూనిట్ ప్రారంభించనున్నకేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ మెడికల్‌ టెక్నాలజీకి హబ్‌గా మారుతోంది. వైద్య పరికరాల తయారీ రంగంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోంది. ఈ క్రమంలోనే ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్‌ తయారీ యూనిట్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రారంభించనున్నారు. ప్రముఖ వైద్య పరికరాల తయారీ కంపెనీ సహజానంద్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌ సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌ వైద్య పరికరాల పార్కులో రూ.250 కోట్లతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌లో సంవత్సరానికి 12 లక్షల 50 వేల స్టెంట్లు తయారు చేయనున్నారు. 20 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్టెంట్ల తయారీ పరిశ్రమలో ఏడాదికి 2200 మందికి ప్రత్యక్షంగా మరో 500 మందికి పరోక్ష ఉపాధి లభించనుంది. భారత స్టెంట్‌ మార్కెట్‌లో సహజానంద్‌ కంపెనీకి 30 శాతానికిపైగా మార్కెట్‌ వాటా ఉంది. గుజరాత్‌ కేంద్రంగా పనిచేస్తున్న సహజానంద్‌ కంపెనీ ప్రపంచంలోని 70 దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

ఈ కంపెనీ తయారు చేసిన స్టెంట్లు అమెరికాలో తయారైన స్టెంట్ల ప్రమాణాలతో పోటీ పడుతున్నాయని అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ ద లాన్సెంట్‌లో ప్రచురితమవడం విశేషం. మెడికల్‌ టెక్నాలజీలో ఆవిష్కరణ, పరిశోధనకుగాను సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో 200 ఎకరాల్లో ఏర్పాటు చేసిన మెడికల్‌ డివైజెస్‌ పార్కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇటీవలే ఈ పార్కులో ఏర్పాటు చేసిన ఏడు కంపెనీలను మంత్రి కేటీఆర్‌ ఒకేసారి ప్రారంభించడం విశేషం. 2017లో ఏర్పాటు చేసిన ఈ మెడ్‌టెక్‌ పార్కు అతి తక్కువ కాలంలో సుమారు 30కిపైగా పేరొందిన కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించిందని పరిశ్రమలశాఖ అధికారులు చెబుతున్నారు.

మెడ్‌టెక్‌ బూమ్‌…
చైనా ప్లస్‌ వన్‌లో భాగంగా చైనా నుంచి వైద్య పరికరాల(మెడ్‌టెక్‌) కంపెనీలు పెట్టుబడులను ఉపసంహరించి భారత్‌కు వస్తుండడంతో సుల్తాన్‌పూర్‌ పార్కు వారికి గమ్యస్థానంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు దిగుమతులు చేసుకుంటున్న మెడ్‌టెక్‌ కంపెనీలు తాజాగా కేంద్రం దిగుమతి సుంకాలు పెంచడంతో స్థానికంగానే వైద్యపరికరాలు తయారు చేసేందుకు యూనిట్లు నెలకొల్పుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని సుల్తాన్‌పూర్‌ పార్కుకు డిమాండ్‌ పెరిగిందని టీఎస్‌ఐఐసీ ఎండీ పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement