గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద నిర్మించిన నాగోల్ ఫ్లైఓవర్‌ను అక్టోబర్ 26 (బుధవారం)వ తేదీన ఐటీ మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. ఉప్పల్ నుంచి ఎల్‌బీనగర్‌కు వెళ్లే ప్రయాణికులకు సిగ్నల్ లేని మార్గాన్ని అందించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. నాగోల్ ఫ్లైఓవర్‌ను రూ.143.58 కోట్లతో నిర్మిస్తున్నామని, ఇందులో యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ తదితరాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ సిటీలో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ గుర్తించింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, రెండు ఫ్లైఓవర్‌లు – ఒకటి కొత్తగూడలో, మరొకటి శిల్పా లేఅవుట్‌లో – డిసెంబర్ మొదటి వారం నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో ఎస్‌ఆర్‌డీపీ కింద 18 ఫ్లైఓవర్‌లు హైదరాబాద్ సిటీలో పూర్తి కానున్నాయి. ఎస్‌ఆర్‌డిపి కింద 47 పనులకు గాను జీహెచ్‌ఎంసీ 41 పనులు చేపట్టింది. వీటిలో మరో ఆరు ఇతర పౌర సంఘాలకు నిర్మాణం కోసం ఇచ్చారు.