హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారుల బృందం అమెరికాలో పర్యటిస్తోంది. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి కేటీఆర్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ డియాగో, సానో హూజే, బోస్టన్, న్యూయార్క్ నగరాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కంపెనీల అధిపతులు, సీనియర్ ప్రతినిధి బృందాలతో సమావేశమవుతారు. పది రోజులపాటు కొనసాగనున్న ఈ టూర్లో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పలు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల కంపెనీల యాజమాన్యాలతో భేటీ అవుతారు.
గతంలో అమెరికాలో పర్యటించి పెద్దఎత్తున పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చిన కేటీఆర్.. ఈ పర్యటన ద్వారా మరిన్ని పెట్టుబడులను తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్‌తో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమలు ఐటీ శాఖకు చెందిన పలు విభాగాల డైరెక్టర్లు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.
ఇప్పటికే ఎఫ్‌డీఐల ఆకర్షణలో ముందున్న తెలంగాణ…
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)లను ఆకర్షించడంలో ముందున్న తెలంగాణ, మంత్రి కేటీఆర్ తాజా అమెరికా పర్యటనతో మరిన్ని పెట్టుబడులను రాబట్టే దిశగా దూసుకువెళుతోంది. కొవిడ్ పరిస్థితుల్లోనూ రెండేళ్లలో అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీలు భారీగా ఎఫ్‌డీఐలు కురిపించాయి. అమెజాన్ ఏకంగా రూ.27వేల కోట్లు పెట్టుబడి ప్రకటించగా, మైక్రోసాఫ్ట్ రూ. 15 వేల కోట్లతో హైదరాబాద్‌లో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ పెట్టుబడిని దశలవారిగా పెడతామని ప్రకటించింది.
అమెరికా నుంచి గతంలో వచ్చిన ఈ దిగ్గజ కంపెనీల పెట్టుబడులే రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. టీఎస్‌ఐపాస్ వంటి పారదర్శక అనుమతుల విధానం కారణంగా భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశాలున్నాయని వారు పేర్కొంటున్నారు.