దావోస్ – తెలంగాణ రాష్ట్ర సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్ధి సాధిస్తున్నదని, ఈ నిరంతర రాష్ట్ర అభివృద్ధి ప్రక్రియలో ప్రభుత్వంతో కలిసి రావాలని ప్రవాస భారతీయులకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు. స్విట్జర్లాండ్‌లోనే దావోస్‌లో నేటి నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనడానికి ఆయన ఆదివారం దావోస్ చేరుకున్నారు. అక్కడ ప్రవాస భారతీయులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు..పర్యటనలోభాగంగా సోమవారం ఉదయం ఆయన ప్రవాస భారతీయులతో భేటి అయ్యారు. అనంతరం ఆయన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు..వందలాది మంది ప్రవాసీలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కెటిఆర్ ప్రసంగిస్తూ, తెలంగాణ అభివృద్ది గురించి వివరించారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిన పురోగతి గురించి, పెట్టుబడుల అవకాశాల గురించి ప్రస్తావించారు..పారిశ్రామికీకరణకు పెద్ద పీట వేస్తున్నతెలంగాణలో పెట్టుబడులు పెట్టవలసిందిగా ఆయన ప్రవాస భారతీయులకు విజ్ఞప్తి చేశారు..
కాగా, నేటి నంచి 20 వరకు జరుగనున్న ఈ సదస్సులో కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం పాల్గొననుంది. ఇందులో భాగంగా పెవిలియన్‌లో పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం అవుతారు. డబ్ల్యూఈఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇండస్ట్రీ రౌండ్‌టేబుల్స్‌లో కూడా కేటీఆర్ పాల్గొంటారు.
రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి సంస్థలకు పెట్టుబడి గమ్యస్థానంగా ప్రదర్శించడం, ప్రైవేట్ రంగంలో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల, పరిశ్రమ అనుకూల విధానాలను హైలైట్ చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించనున్నారు. ఇదిలా ఉంటే దావోస్‌కు తెలంగాణ ప్రతినిధుల బృందాన్ని పంపడం ఇది ఐదవసారి.
2018లో తొలిసారిగా తెలంగాణ నుంచి దావోస్‌కు ప్రతినిధులు వెళ్లగా 2019, 2020, 2022లోనూ హాజరయ్యారు. ఈ అయిదు రోజుల పర్యటనలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నుంచి తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడం ద్వారా ప్రైవేటు రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం లక్ష్యంగా కేటీఆర్ ప్రసంగాలు, భేటీలు నిర్వహించనున్నారు.