Tuesday, November 19, 2024

కాంగ్రెస్,బిజెపిలతో పొత్తు క‌ల్ల – ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో కెటిఆర్…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: దేశంలో ఉద్యమ పార్టీగా అవతరించి ఘన విజయం సాధించిన ఏకైక రాజకీయ పార్టీ ‘బీఆర్‌ఎస్‌’. మాది 22ఏళ్ళ రాజకీయం. తొమ్మిదేళ్ళ సక్సెస్‌ఫుల్‌ పాలన. దేశం ఆచరించదగిన సరికొత్త సంక్షేమ పథకాలు, వద్దన్నా హర్షించక తప్పని అభివృద్ధి ఫలాలు. 2001లో కేసీఆర్‌ నాటిన మొక్క క్రమక్రమంగా ఎదిగి నేడు భారీ వృక్షమైంది. ఒకప్పటి టీఆర్‌ఎస్‌… నేడు బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందింది. చెరగని ఉద్యమ స్ఫూర్తి, ఏమాత్రం తగ్గని అచంచల ఆత్మ విశ్వాసం, గురితప్పని లక్ష్యంతో ఇప్పుడు దేశానికి మార్గనిర్దేశం చేస్తోంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో దేశం ప్రత్యామ్నా యం ఆశిస్తోంది. అందుకు ఉద్యమ నేత, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నేతృత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ మినహా దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు, రైతు, కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు పలుకుతూ స్వాగతిస్తున్నాయి. మోడీని ఎదుర్కొనే సత్తా కేసీఆర్‌ ఒక్కరికే ఉందన్న నినాదం బలపడుతోంది. నాడు గుజరాత్‌ మోడల్‌ నినాదంతో నరేంద్రమోడీ ప్రధాని పీఠాన్ని అధిష్టిస్తే, నేడు తెలంగాణ మోడల్‌ నినాదంతో కేసీఆర్‌ కదనరంగంలో అడుగుపెట్టారు. రాజకీయాల్లో వనవాసం, అజ్ఞాతవాసం, పట్టాభిషేకం.. అన్నీ ఉంటా యి. ఆషామాషీ డైలాగులు కాదు.. ఆధారాలు, లెక్కలతో సిద్ధంగా ఉన్నాం. దేశంలో మోడీ కుట్రపూరిత రాజకీయం అదుపు తప్పుతోంది. కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో కూడా పనికిరాకుండా పోయింది. 70 ఏళ్ళ కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో పదహారేళ్ళ యువకుడిలా పరుగెడుతు న్నారు. ఆయన ఇప్పుడే రాజకీయాల నుంచి తప్పు కునేంత, సీఎం పదవి నుంచి దిగిపో యంత వీక్‌గా లేరు. మరోసారి గెలిచి హ్యాట్రిక్‌ సీఎం అవుతారు. బీఆర్‌ఎస్‌లో లక్షలాది మంది సైనికుల్లో ఒకరిగా మేమంతా పట్టు దలతో పనిచేసి మరోసారి అధికారం సాధించి తీరుతాం. ఎన్ని అవాకులు, చెవాకులు పేల్చినా.. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. రాష్ట్రంలో 100 అసెంబ్లిd స్థానాలు గెలవడం టార్గెట్‌గా పెట్టుకున్నాం. 90 స్థానాలకు తగ్గేదేలేదు. టిక్కెట్ల కోసం నాయకుల్లో పోటీ పెరిగితే.. స్థానికంగా గెలిచే అవకాశాలు మెరుగైనట్లుగా భావిస్తున్నాం. ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు బ్రహ్మ రథం పడుతు న్నారు. జూన్‌లో యువజన, విద్యార్థి సమ్మేళనాలు నిర్వహిస్తాం. మా ఉనికి కేసీఆర్‌.. ఆయన మార్గనిర్దేశం మేరకు ముందుకు సాగుతాం.. అని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు అన్నారు. పార్టీ భవిష్యత్తుపై ఆయన సంపూర్ణ విశ్వా సాన్ని, నమ్మకాన్ని వ్యక్తపరిచారు. తమ నాయకుడు కేసీఆర్‌ ఏ లక్ష్యాన్ని ఎంచుకు న్నా.. అది ఖచ్చితంగా విజయం సాధించి కార్యరూ పం లోకి వస్తుందని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అభాసుపాలైన కాంగ్రెస్‌, బీజేపీలతో పొత్తులకు వెళ్ళే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు

. ‘ఆంధ్రప్రభ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని మహారాష్ట్ర ప్రజలు, నాయకులు హర్షిస్తూ.. స్వాగతిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే వేలాదిగా ముఖ్య నేతలంతా వచ్చి పార్టీలో చేరుతున్నారని చెప్పారు.
ప్రశ్న: మీ పార్టీ జాతీయ రాజకీయాల వ్యూహమేంటి?
జవాబు: అందుబాటులో ఉన్న సహజ వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకునే ప్రణాళికను ప్రకటి స్తాం. ఉద్యమ స్ఫూర్తితో పార్టీని విస్తరిస్తాం. అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుంటాం. తద్వారా దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న రైతు కుటుంబాలు, వ్యవసాయ కార్మికు లు బాగుపడతారు. ఆర్థికంగా దేశం సుభిక్షంగా ఉంటుంది.

ప్రశ్న: సంక్షేమ రంగంలో ఊహించని ఫలితాల వెనక ఏముంది?
జవాబు: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలకులు తెలంగాణ ఉద్యమాన్ని వ్యక్తిత్వాన్ని కించపరిచారు. మేం లేకుంటే పాలన చేతకాదంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ ప్రభు త్వంలో పట్టుదలతో ఫలితాలను సాధించి చూపడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ముందు విద్యుత్‌, తర్వాత వ్యవసాయం, సాగునీరు, సంక్షేమ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఆశించిన ఫలితాలు సాధించాం. నేడు దేశానికే మార్గదర్శిగా నిలిచాం.

ప్రశ్న: ఈ ఏడాది ప్రభుత్వం, పార్టీలో ప్రత్యేకత ఏమిటి?
జవాబు: 2023లో అంతర్జాతీయ పెట్టుబడులతో తెలంగాణ ప్రతిష్ట విశ్వవ్యాప్తమైంది. ప్రభుత్వ పరంగా అన్ని స్థాయిల్లో ఫలితాలు సాధించి ప్రజల మెప్పు పొందాం. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలలో పట్టు సాధించి జాతీయ స్థాయిలో అడుగు పెడతాం. జాతీయ పార్టీగా ఈ ఏడాది మొదటి ప్లీనరీ నిర్వహించనున్నాం. చేసిన పనిని చెప్పుకుంటే చాలు.. గెలుస్తామన్న నమ్మకం కలిగింది. 2024లో దక్షిణాదిలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో గట్టి పోరాటానికి సిద్ధమవుతున్నాం.

ప్రశ్న: దక్షిణాది రాష్టాల ఎన్నికల ప్రచారంలో ఎవరెవరు పాల్గొంటారు?
జవాబు: ఆ అంశంపై అధినేత కేసీఆర్‌ వ్యూహాత్మక ప్రణాళికను రచిస్తున్నారు. జేడీఎస్‌కు మద్దతుగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. అధిష్టానం ఆదేశాల మేరకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. మహారాష్ట్రలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అనేక చోట్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను రంగంలోకి దింపుతాం.

ప్రశ్న: నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ నినాదమేంటి?
జవాబు: చేసిన అభివృద్ధిని కళ్ళముందు చూపించడమే మా నినాదం. 1001 గురుకుల పాఠశాలలు, ప్రతి జిల్లాకో నర్సింగ్‌ కళాశాల, ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు, సాధించిన విజయాలు చెప్పుకుంటాం. అన్ని నియోజక వర్గాల్లో మే 1న కార్మిక దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరగాలి. కేంద్రం చేతుల్లో వ్యవస్థలున్నాయి. ఇక వారిష్టం.
ప్రశ్న: ప్రజలతో మమేకమయ్యే ప్లాన్‌?
జవాబు: అసెంబ్లిd నియోజకవర్గాల్లో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రజల బ్రహ్మరథం పడుతున్నారు. జూన్‌ నుంచి యువజన, విద్యార్థి సమ్మేళనాలు నిర్వహిస్తాం, రాజకీయాల్లో క్రియాశీలకం చేయాలన్నదే లక్ష్యం. కేంద్రంలోని బీజేపీ సర్కారు, ప్రతిపక్ష కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగడతాం.

ప్రశ్న: నియోజకవర్గాల్లో టిక్కెట్ల పంచాయితీలపై మీరే మంటారు?
జవాబు: కొన్ని నియోజకవర్గాల్లో సీట్ల కోసం పోటీ ఉన్న మాట వాస్తవమే. కానీ అది పార్టీ ఎదుగుతోందని, బలపడుతోందని చెప్పడానికి చిహ్నం. గెలిచే అవకాశా లున్నాయి.. కాబట్టే పోటీతత్వం పెరుగుతోంది. ఓడిపోతామన్న అభ్యర్థులు ఎందుకు పోటీ పడతారు. అయినా అలాంటి నియోజకవర్గాలపై దృష్టి సారించాం. స్థానికంగా ప్రజల నుంచి ఆదరణ ఎవరికి ఎక్కువగా ఉంటే వారికి సీట్లిచ్చి, నాయకులందరితో కలిసికట్టుగా పని చేయిస్తాం. రాజకీయాల్లో బయటకు వెళ్ళడం, రావడం సర్వసాధారణమే. ఒకరిద్దరు నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదు. ప్రజాదరణ లేని వాళ్ళే ఇలా చేస్తారు.

ప్రశ్న:చంద్రబాబు తాజాగా మోడీని పొగడడంపై మీ స్పందన?
జవాబు: చంద్రబాబువి అవకాశవాద రాజకీ యాలు. ప్రధాని మోడీని ఎందుకు పొగడాల్సి వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకా.. విభజన చట్టం హా మీలు నెరవేర్చనందుకా.. పోలవరం ప్రాజెక్టుకు జాతీ య హోదా ఇవ్వనందుకా.. విషం చిమ్ముతూ అభివృద్ధి ని అడ్డుకుంటున్నందుకా.. ఎందుకో ఆయనే చెప్పాలి. సమకాలీన రాజకీయాల్లో ఇది సరైన విధానం కానేకాదు.

ప్రశ్న:ఈటల వర్సెస్‌ రేవంత్‌ వ్యాఖ్యలపై మీ స్పందన?
జవాబు: తాజాగా జరిగిన ఘటన.. ఈటల రాజేందర్‌ ఆరోపణలతో రేవంత్‌రెడ్డి గుడిలో ప్రమా ణం చేయడం ఆశ్యర్యంగా ఉంది. ప్రమాణాలతో సమస్యలు తీరితే ఇక వ్యవస్థలెందుకు? రేవంత్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ ఏడ్వడం ఏందయ్యా.. అన్న ఈటల మాటలు నాకు నచ్చాయి.

ప్రశ్న: రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొంటారు?
జవాబు: ప్రతిపక్షాల్లో సీఎం అభ్యర్థి ఎవరో కూడా చెప్పలేని దుస్థితి. అలాంటి వారు రాజకీయాల్లో ఎలా పనికొస్తారు. కుర్చీల కోసం కొట్లాట, పంచాయితీలు, విభేదాలున్న పార్టీలు ప్రజలకు ఏం మేలు చేస్తాయో అర్థం కావడం లేదు. లొడలొడ వాగుడు తప్ప కాంగ్రెస్‌, బీజేపీల వద్ద ప్రణాళిక, పద్ధతి లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొనడం కాదు.. ప్రజలే వారిని తిరస్కరిస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీజేపీకి 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఈసారి 100 సీట్లలో గల్లంతు తప్పదు


ప్రశ్న: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ పోరాటం ఎవరిపై?
జవాబు: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ నీడను కూడా ఎవరూ తాకలేరు. ఆయనకున్న ముందుచూపు అలాంటిది. ఆయన పోరాటం వ్యక్తులపై కానేకాదు. వ్యవస్థలను నాశనం చేస్తున్న పార్టీలపైనే. సమవుజ్జీలతో పోరాడడమే ఆయన లక్ష్యం. రాజకీయ మరుగుజ్జులతో, పిచ్చోళ్ళతో పోటీ పడలేం. కేసీఆర్‌ శాశ్వత నిర్మాణాలతో పోటీ పడితే, ప్రతిపక్షాలు విధ్వంసాలను నినాదంగా ఎంచుకోవడం బాధాకరం. ప్రతిష్టాత్మక కాళేశ్వరం, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, ప్రసిద్ధిగాంచిన యాదాద్రి ఆలయ నిర్మాణం మనకు కళ్ళముందు దర్శనమిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement