హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మాటను వారు కాదని చెప్తే, అందుకు సంబంధించిన సాక్ష్యాలను తానే బయటపెడతానని స్పష్టం చేశారు. గతంలో కరీంనగర్, నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నకల్లో చీకటి ఒప్పందం చేసుకున్నట్టే ఇప్పుడు హుజూరాబాద్‌లో కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. గోల్కొండ హోటల్లో ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి రహస్యంగా కలిశారని సమాచారం ఉందని చెప్పారు. ఇద్దరు కలిసింది నిజామా? కాదా? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ బాగోగులు పట్టించుకోకుండా ఇతర పార్టీల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ మానిక్కం ఠాగూర్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. గాంధీ భవన్లో గాడ్సేలు దూరారని విమర్శించారు. దళిత బంధును ఆపడం ఏమాత్రం సబబో ఆలోచించాలని ఈసీని కోరారు. ఎన్నికల కమిషన్ పరిధి దాటి వ్యవహరిస్తోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: రాజీనామాకు రెడీ: పరిటాల సునీతకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్