Wednesday, November 20, 2024

తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గింది: మంత్రి కేటీఆర్

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కీలక సమావేశం సచివాలయంలో జరిగింది.ఈ భేటీలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో పాటు కమిటీ సభ్యులు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌తో పాటు సీఎంవో ప్రత్యేకాధికారి రాజశేఖర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అందరి సహకారంతో కరోనా గండం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాం. తెలంగాణలో తీవ్రత తగ్గిందని కేంద్ర మంత్రి కూడా చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయి. సాధ్యమైనంత వేగంగా ప్రజలను బయటపడేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.

తెలంగాణ ప్రజలతో పాటు మిగతా నాలుగైదు రాష్ట్రాలకు కూడా హైదరాబాద్ కల్పతరువులా నిలిచిందని వ్యాఖ్యానించారు కేటీఆర్. ఇక కొవిడ్ చికిత్స ఔషధాలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్న విషయమై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాం. కేంద్ర ప్రభుత్వానికి అన్ని అంశాలను వివరించాం. ఇంటింటి సర్వే, హోం ఐసోలేషన్ కిట్లతో విలువైన ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఏర్పడింది. అన్ని ఔషధాలను రాబోయే మూడు నెలల కోసం సమకూర్చుకుంటున్నాం. రెమ్‌డిసివర్ సరిపడా పూర్తి స్థాయిలో తెప్పించుకున్నాం, ఇంకా అదనంగా ఆర్డర్‌ చేశాం. బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తూ కట్టడి చేస్తున్నాం. రెమ్‌డిసివర్ ఇష్టారీతిన వాడొద్దని ఆస్పత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ప్రతి రోజూ ఆక్సిజన్ ఆడిటింగ్ జరుగుతోంది. అవసరానికి మించి ఆక్సిజన్, ఔషధాలు వాడకుండా చూస్తున్నాం. అన్ని జిల్లాల్లో మంత్రులు పూర్తి స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు’’ అని కేటీఆర్‌ వివరించారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement