పేపర్ వేస్తే తప్పేంటి ? అన్న ఓ బాలుడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉదయాన్నే చాలా మంది చిన్నారులు పేపర్ వేస్తూ కనిపిస్తుంటారు. వివిధ కారణాల వలన బాల్యం నుంచే కష్టపడి పనిచేయాల్సి వస్తుంటుంది. జగిత్యాల పట్టణానికి చెందిన జయప్రకాశ్ అనే విద్యార్థి ఉదయాన్నే పేపర్ వేస్తుండగా ఓ వ్యక్తి చదువుకునే వయసులో పేపర్ ఎందుకు వేస్తున్నావ్ అని ప్రశ్నించగా, తప్పేముంది, పేపర్ వేస్తూ చదువుకోకూడగా అని ఎదురు ప్రశ్నించారు.
పాత బస్టాండ్ వద్దనున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నానని సమాధానమిచ్చాడు. మరి ఈ ఏజ్‌లో పేపర్ వేస్తున్నావ్..? అని ప్రశ్నించగా.. ‘ఏ పేపర్ వేయొద్దా?’ అంటూ బదులిచ్చాడు. మంచిది కానీ.. చదువుకుంటున్న సమయంలో పని చేస్తున్నావ్‌గా అని అడగగా.. చదువుకుంటున్నా, పనిచేసుకుంటున్నా అందులో తప్పేముందంటూ అని చెప్పాడు. చిన్నతనం నుంచి కష్టపడి పనిచేస్తూ చదువుకుంటే పెద్దయ్యాక ఏ పని చేయాలన్నా కష్టం అనిపించదని సమాధానం చెప్పాడు. దీనిని సంబందించిన వీడియోను సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను చూసిన మంత్రి కేటీఆర్ చిన్నారిని అభినందించారు. విద్యార్థిలోని ఆత్మవిశ్వాసానికి మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. భవిష్యత్తులో మంచి స్థితిలో స్థిరపడాలని కోరుకుంటున్నట్టు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.