Friday, November 22, 2024

KTR: ఏప్రిల్ నుంచి కొత్త పెన్ష‌న్లు.. జూన్ నుంచే ఇంగ్లీష్ మీడియం బోధన

వ‌చ్చే నెల నుంచి కొత్త పెన్ష‌న్లు ఇవ్వ‌బోతున్నామ‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉప్ప‌ల్‌లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో రూ. 35 కోట్ల స్కై వాక్‌ను నిర్మిస్తున్నామని, దాన్ని వ‌చ్చే నెల‌లోనే ప్రారంభిస్తామ‌ని అన్నారు. హైదరాబాద్ లోని ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌ల్లాపూర్‌లో నూత‌నంగా నిర్మించిన‌ వైకుంఠ‌ధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉప్ప‌ల్‌లో ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌న్నారు. రూ.900 కోట్లతో నాలాల అభివృద్ధి చేపట్టామన్నారు. గ‌తేడాది వ‌ర్షాలు బాగా కురిసిన‌ప్పుడు చాలా ఇబ్బంది ప‌డామని, ప్ర‌తి నీటి మురికి చుక్క‌ను మూసీలోకి వ‌దిలేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ఉప్ప‌ల్ వ‌ద్ద ట్రాఫిక్ బాగా పెరిగిపోతోందన్న మంత్రి కేటీఆర్.. అక్క‌డ ఫ్లై ఓవ‌ర్లు, స్కైవేలు క‌డుతున్నామ‌ని చెప్పారు.

సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో రాష్ట్ర అభివృద్ధి శ‌ర‌వేగంగా జ‌రుగుతోందన్నారు. సంక్షేమంలో కూడా ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నామని చెప్పారు. వ‌చ్చే నెల నుంచి కొత్త పెన్ష‌న్లు ఇవ్వ‌బోతున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మ‌న బ‌స్తీ మ‌న బ‌డి కింద ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను ఆధునీక‌రిస్తున్నామ‌ని తెలిపారు. ఈ జూన్ నుంచే ఇంగ్లీష్ మీడియం ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని చెప్పారు. హైద‌రాబాద్‌కు నలుమూలాల వెయ్యి ప‌డ‌క‌ల ఆస్ప‌త్రుల‌ను నిర్మించ‌బోతున్నామ‌ని వెల్లడించారు. పేద‌ల‌కు అవ‌స‌ర‌మైన విద్య‌, వైద్య‌, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement