తెలంగాణలో ఆడపిల్ల పుడితే అదృష్ట లక్ష్మి పుట్టిందని, సంబరపడే రోజులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పటాన్ చెరులోనీ జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వమే ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తూ మేనమామగా సీఎం కేసీఆర్ మారారని తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు దేశంలో మరే రాష్ట్రం కూడా అమలు చేయడం లేదన్నారు. మహిళా సాధికారత కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కుల మత తారతమ్యం లేకుండా 9 వేల కోట్లతో కళ్యాణ లక్ష్మి పథకంని తీసుకువచ్చి 10 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో గణనీయంగా మాతాశిశు మరణాల సంఖ్య తగ్గిందన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాల సంఖ్య కూడా పెరిగింది అన్నారు. అప్పుడే పుట్టిన శిశువుల కోసం ఇప్పటివరకు 11 లక్షల కేసీఆర్ కిట్లు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే వివరించారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారన్నారు. ఔత్సాహిక మహిళ పారిశ్రామికవేత్తల కోసం వి హబ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని పటాన్చెరులో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో 350 పడకల ఆస్పత్రికి నిధులు కేటాయించడం ని గుర్తు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా దినోత్సవ కానుక గా ముఖ్యమంత్రి కెసిఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అందుకోసం బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో మహిళలకు ప్రత్యేక ఆదరణ లభిస్తోందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి లోకి తీసుకు వెళ్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృషిని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. వేడుకల్లో భాగంగా పలువురు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కరాటే విన్యాసాలను మంత్రి కేటీఆర్ తిలకించారు.