Saturday, November 23, 2024

KTR | తెలంగాణ‌లో పెద్దఎత్తున అభివృద్ధి ప‌నులు, కేంద్ర సాయం కావాలే.. హర్దీప్ సింగ్​తో కేటీఆర్ భేటీ

మంత్రి కేటీఆర్ ఢిల్లీ టూర్‌లో ఉన్నారు. రెండ్రోజులుగా ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను, ప‌లువురు మంత్రుల‌తో వ‌రుసగా భేటీ అవుతున్నారు. కాగా, ఇవ్వాల (శ‌నివారం) రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు అంశాలకు సంబంధించిన విజ్ఞప్తులను కేంద్రం మంత్రి హర్దీప్ సింగ్ పూరికి అందించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కేటీఆర్ కోరారు. లకిడికపూల్ నుంచి బిహెచ్ఇఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు ఐదు కిలోమీటర్ల మెట్రోకు ఆమోదంతో పాటు కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరి పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకురావాలని మరొక ప్రతిపాదనను కూడా కేంద్రానికి మంత్రి కేటీఆర్ అంద‌జేసిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో చేపట్టిన మిస్సింగ్, లింకు రోడ్ల‌ కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయని, ఇప్పటికే 22 మిస్సింగ్ లింక్ రోడ్లను పూర్తి చేశామని.. మరో 17 రోడ్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని కేటీఆర్ తెలిపారు.

ఇదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్డు నుంచి పరిసర పురపాలికలకు మొత్తం 104 అదనపు కారిడార్లను నిర్మించేందుకు దాదాపు 2400 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుమారు 800 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరం లో పారిశుధ్య కార్యక్రమాలు ముఖ్యంగా ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను శుద్ధి చేయడంతో పాటు చెత్తను తరలించేందుకు అవసరమైన వాహనాల ప్రోక్యుర్మెంట్ కోసం, ట్రాన్స్ఫర్ స్టేషన్ ల నిర్మాణం వంటి వివిధ కార్యక్రమాల కోసం స్వచ్ఛ భారత్ మిషన్ లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కింద 400 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు.

- Advertisement -

3050 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి 15శాతం నిధులను కేంద్రం అందించాలని ఇందుకోసం 450 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేసిన‌ట్టు స‌మాచారం. హైదరాబాద్ నగర పరిధిలో చేపడుతున్న ఎస్టిపిల నిర్మాణ ఖర్చు దాదాపు 3722 కోట్ల రూపాయలు అని ఇందులో కనీసం 20 శాతం 744 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందించాలని త‌న నివేదిక‌లో వెల్ల‌డించారు.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్దేశించిన సిటిజన్ సెంట్రిక్ రిఫార్మ్స్ కింద బయో మైనింగ్, మానవ వ్యర్ధాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టిందని వీటి అన్నింటి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలికల్లో చేపడుతున్న కార్యక్రమాలకు మొత్తంగా 3777 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ఇందులో 750 కోట్ల రూపాయలను కేంద్రం ఆర్థిక సాయం చేయాలి అన్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ కార్యక్రమం పైన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రశంసలు కురిపించారు. ఇట్లాంటి వినూత్నమైన ఆలోచనలతో కూడిన శానిటేషన్ హబ్ వలన పురపాలక అభివృద్ధిలో అనేక సవాళ్లకు సమాధానం దొరుకుతుందన్నారు. ఈ అంశం పైన తెలంగాణ రాష్ట్రం తన నమూనాను, ఆలోచనలను పంచుకోవాలని హర్దీప్ సింగ్ పూరి కోరారు. త్వరలోనే తన మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎస్ ఆర్ డి పి, లింకు రోడ్లు, పారిశుద్ధ్యరంగంలో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అర్బన్ డెవలప్మెంట్ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు హైదరాబాద్ రావాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement