Saturday, November 23, 2024

ఫారెన్​ ఫండ్స్​ కోసం అమెరికా పోతున్న కేటీఆర్‌.. 26 వరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారీ పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు వారం రోజులపాటు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. శనివారం ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు – మన బడి కార్యక్రమంలో ప్రవాసుల నుంచి పెద్దఎత్తున విరాళాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేటీఆర్‌ తన పర్యటనలో అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులను కలవాలని నిర్ణయించారు. కోటి రూపాయలు అంతకన్నా ఎక్కువ విరాళమిచ్చే దాత పేరును సంబంధిత పాఠశాలకు పెడతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 20 లక్షలకు ఆపైన విరాళమిచ్చే దాతల పేర్లను తరగతి గదికి పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. తన అమెరికా పర్యటనలో వివిధ బహుళ జాతి సంస్థలతో పరిశ్రమల ఏర్పాటుకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.

మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా పరిశ్రమలు, ఐటీ ఆయా రాష్ట్రాల్లో సదస్సులను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు అమెరికా బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించే సంస్థలకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. బహుళ జాతి సంస్థలు తెలంగాణలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తే రెండు వారాల్లోనే అన్ని రకాల అనుమతులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం టీఎస్‌-ఐపాస్‌, టీఎస్‌-బీపాస్‌ను తీసుకువచ్చింది. అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్‌ బడా పారిశ్రామికవేత్తలను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరనున్నారు. మంత్రితో పాటు ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఇతర ఉన్నతాధికారులు అమెరికా వెళుతున్నట్లు సమాచారం. ఈనెల 26 వరకు కేటీఆర్‌ అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement