– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
రాబోయే ఎన్నికల్లో మన ప్రత్యర్థిగా ఏ జాతీయ పార్టీతో పోరాడాలి? రెండు జాతీయ పార్టీలతో ఒకేసారి యుద్ధం సాధ్యమేనా? మన ప్రధాన ప్రత్యర్థిగా ఎవర్నీ చూడాలి? అని మరో నెటిజన్ ప్రశ్నించాడు. కేటీఆర్ స్పందిస్తూ.. జాతీయ పార్టీలే ఎందుకు? పోటీలో చాలామంది ఉన్నారు కదా అని బదులిచ్చారు.
మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి సవాల్ అని అనుకోవచ్చా సార్ అని ఒకరు అడగ్గా.. తనకు తెలిసినంతవరకు మునుగోడు అంశం కేవలం మరో ఉపఎన్నిక మాత్రమే అని, దాంతో ఏం మారుతుందని కేటీఆర్ ప్రశ్నించారు.
ఎలాంటి రాజకీయ బలం లేకుండా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువతకు మీరు ఏం చెప్తారు? అని ఓ నెటిజన్ అడగ్గా.. కేటీఆర్ స్పందిస్తూ.. ఎలాంటి రాజకీయ బలం లేని వారు చాలా మంది ఉన్నారు. మన ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేల్లో చాలా మంది రాజకీయ బలం లేకుండానే ఎదిగారు కదా అని స్పష్టం చేశారు.
కేటీఆర్ సార్.. మీ నాయకత్వం, మీ నైపుణ్యం కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తాయి. ఇది చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. అదే విధంగా మిమ్మల్ని బిగ్ స్క్రీన్‌పై చూడటానికి ఏమైనా అవకాశాలున్నాయా? అని ఓ నెటిజన్ అడిగారు. నా పొలిటికల్ స్పీచ్‌లు మీరు బిగ్ స్ర్కీన్ పై చూస్తే తప్ప కనిపించను అని కేటీఆర్ బదులిచ్చారు.
నాది వైజాగ్.. మీకు పెద్ద అభిమానిని సార్ అని మరొకరు ట్వీట్ చేశారు. నాకు కూడా వైజాగ్ అంటే ఎంతో ఇష్టమని కేటీఆర్ ట్వీట్ చేశారు. ట్యాంక్‌బండ్‌పై సండే ఫండే మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారని ఓ హైదరాబాదీ అడగ్గా.. త్వరలోనే ప్రారంభిస్తామని ఆన్సర్ ఇచ్చారు.
ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణను ఎవరి చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని ఓ నెటిజన్ కోరగా.. మీ అందరి ఆశీర్వాదం, సహకారంతో.. తెలంగాణకు టీఆర్ఎస్ సేవ చేస్తూనే ఉంటుందన్నారు కేటీఆర్. ఇక.. తెలంగాణ బీజేపీ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ.. ప్రచారంలో దూసుకుపోతుంటే టీఆర్ఎస్ పెద్దలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని మరో నెటిజన్ అడిగారు. దీనిపై కేటీఆర్ చమత్కారంగా స్పందించారు. ఖాళీ పాత్రలు ఎక్కువ చప్పుడు చేస్తాయని చమత్కారించారు కేటీఆర్.
ఖమ్మంలోని చెరువులో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంపై మీ అభిప్రాయం తెలుపండి సార్ అని ఒకరు కేటీఆర్‌ను ప్రశ్నించగా.. ఓ లెజెండ్ నాయకుడు ఎన్టీఆర్ గారిని గౌరవిస్తే.. తప్పేంటని కేటీఆర్ అడిగారు. అన్న బండి సంజయ్ ఎప్పుడైనా ఇంగ్లీష్‌లో ట్వీట్ చేసిండా? అని కేటీఆర్‌ను అడగ్గా.. దానికి మీరే సమాధానం చెప్పాలని కేటీఆర్ రిప్లై ఇచ్చారు.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మోదీని ఎందుకు అగౌరవ పరిచారని ఓ నెటిజన్ కేటీఆర్‌ను అడిగారు. దానికి కేటీఆర్ ఇలా బదులిచ్చారు. మేం మోదీని ఎక్కడ అగౌరవపరిచాం. ప్రధాన మంత్రి అనధికారిక, ప్రయివేటు కార్యక్రమానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వెళ్లి ఆహ్వానించాల్సిన అవసరం లేదని.. ప్రోటోకాల్ స్పష్టంగా చెప్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
సార్ నేను మీకు పెద్ద అభిమానిని. నాకు గ్రూప్ -1 ప్రశ్నాపత్రం పంపండి.. గొప్ప సాయం చేసిన వారు అవుతారని ఓ యువకుడు కేటీఆర్‌ను అడిగాడు. కేటీఆర్ స్పందిస్తూ నేను కేవలం సీరియస్ ప్రశ్నలకే స్పందిస్తానని బదులిచ్చారు.