తెలంగాణలో రిమోట్ కంట్రోల్ పాలన కొనసాగుతుందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రిమోట్ కంట్రోల్ పాలన ఎవరిది? మీ కాంగ్రెస్ పార్టీది కాదా? అని ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ పేరుకు ప్రధాని.. నిర్ణయాలు మాత్రం సోనియావే అని అన్నారు. రిమోట్ కంట్రోల్ పాలన చేసింది కాంగ్రెస్సే అని పేర్కొన్నారు. నేరపూరితమైన రాజకీయాలను అరికట్టాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో నిర్ణయ తీసుకొని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారని, ఆ ఆర్డినెన్స్‌ను చింపేసింది రాహుల్ గాందీ కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
తమకు ఒక్క చాన్స్ ఇవ్వాలని రాహుల్ గాంధీ అంటున్నారని, ఒక్క ఛాన్స్ కాదు.. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి పది ఛాన్సులు ఇచ్చారని తెలిపారు. 50 ఏళ్లు ఈ దేశాన్ని కాంగ్రెస్ కే అప్పగించారన్నారు. కరెంట్, నీళ్లు ఇవ్వలేని అసమర్థ పార్టీ అని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలను నివారించలేని పార్టీ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా జోడించి అన్ని రంగాల్లో సమ్మిళితమైన అభివృద్ధిని సాధిస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ చెప్పిందల్లా నమ్మడానికి, పరిజ్ఞానం లేని మాటలను విశ్వసించడానికి ఇది టెన్ జన్‌పథ్ కాదని, ఇది చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ జనపథం అని కేటార్ పేర్కొన్నారు.