హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బలిదేవత అన్న వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారని,. గాంధీ భవన్‌ను గాడ్సేకు అప్పగించి తన అంతానికి కాంగ్రెస్ వీలునామా రాసుకుందని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు.. ఇది కాంగ్రెస్ అమాయకత్వమో, ఆత్మహత్యా సదృశ్యమో తేల్చుకోవాలి అని అన్నారు. యూత్ డిక్లేరేషన్ పేరుతో పిసిపి నిర్వహిస్తున్న యువ సంఘర్షణ సభలో పాల్గొనేందుకు రేపు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా రానున్న సందర్భంగా కెటిఆర్ ఆ పార్టీ నేతల తీరుపై ఘాటుగా స్పందించారు.. రాజకీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం పలుకుతుంది అని అంటూ ప్రియాంక గాంధీ తన పొలిటికల్ టూర్‌ను ఎడ్యుకేషన్ టూర్‌గా మార్చుకుని తెలంగాణ ప్రజలకు అందుతున్న వాటి ఫలాలను తెలుసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్, బీజేపీలకు ఒక పాలసీ అంటూ ఉంటే దేశంలో నిరుద్యోగ సమస్య ఉండేదే కాదన్నారు. నిరుద్యోగాన్ని పెంచి పోషించినందుకు కాంగ్రెస్, బీజేపీ యువతకు క్షమాపణ చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలకు కారణమైనందుకు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ తరపున క్షమాపణ చెప్పాలని కోరారు.. తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలనలో సాధించిన విజయాలు తెలుసుకోవాలని ప్రియాంకాని కోరారు కెటిఆర్.. అన్ని రంగాలలో తెలంగాణ దేశంలో నంబర్ వన్‌గా ఉందన్నారు. ప్రభుత్వ రంగంలో 2.2 లక్షల ఉద్యోగాలు, ప్రయివేటు రంగంలో 22 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు..