కామారెడ్డి : 50ఏళ్లు పాలించి తెలంగాణకు ఏమీ చేయని కాంగ్రెస్ ను, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఒక్కపైసా కూడా విదల్చని బిజెపిని వచ్చే ఎన్నికలలో కర్రుకాల్చివాత పెట్టి చిత్తుగా ఓడించాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ప్రజలను కోరారు.. భారీ మెజార్టీతో బిఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపు ఇచ్చారు.. కామారెడ్డి జిల్లాలో నాగమడగ ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో కెటిఆర్ మాట్లాడుతూ, ఎవరు నీతిమంతులో, ఎవరు అవినీతిపరులో.. ఎవరేం తప్పు చేశారో, ఒప్పు చేశారో.. 2023లో ప్రజలే తీర్పు ఇస్తారు అని కేటీఆర్ స్పష్టం చేశారు . రెండు రోజుల క్రితం తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందని అంటూ . ఈ దేశంలో అద్భుతమైన మహానటుడు ఉన్నాడు. అతన్నిపంపితే ఆస్కార్ తప్పకుండా వచ్చేదంటూ ప్రధాని మోడీపై సెటైర్ వేశారు మంత్రి.
55 ఏండ్లు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ఒక్క మంచి పని కూడా చేయలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. పాదయాత్రలు చేస్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారని,. 10 ఛాన్స్‌లు ఇచ్చారు. 50 ఏండ్లు అవకాశం ఇచ్చిన్పపుడు కరెంట్, నీళ్లు, విద్య ఇవ్వనోడు.. ఇవాళ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఇలా అడగడంతో వాళ్లు పిచ్చొళ్లా…? మనం పిచ్చొళ్లామా..? ఆలోచించాలి. నిన్న మొన్నటి దాకా మనల్ని చావగొట్టింది కాంగ్రెసోళ్లే. ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టలేదు. పెన్షన్లు ఇవ్వడం చేతకాలేదు. కాంగ్రెసోళ్లను పట్టించుకోవద్దు. అధికారం ఉన్నప్పుడు ఏం చేయలేనోడు.. ఇవాళ వచ్చి డైలాగులు కొడితే పడిపోదామా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మోసపూరిత మాటలకు మోసపోవద్దు అని కేటీఆర్ సూచించారు.
గిరిజన తండాలను, గూడెలను గ్రామపంచాయతీలుగా చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. తండాల్లో రోడ్లను అభివృద్ధి చేస్తాం. గిరిజనులకు సర్పంచ్‌లుగా అవకాశం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. బిచ్కుంద, పిట్లంను మున్సిపాలిటీలుగా మారుస్తామని అంటూ మిగతా మున్సిపాలిటీల కంటే ఈ రెండింటిని అద్భుతంగా తీర్చిదిద్దుతాం అని కేటీఆర్ ప్రకటించారు.