కరోనాకు ఇస్తున్న ఆయుర్వేద మందు సంచలనం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలోని ఆనందయ్య వద్దకు.. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి సైతం బాధితులు బారులు తీరుతున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనాకు ఆయుర్వేద మందు పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనాకు ఉచితంగా ఆయుర్వేద మందు ఇస్తున్నారన్న విషయం తెలుసుకుని కృష్ణపట్నంకు ప్రజలు వేలాదిగా తరలివస్తున్నారు. ఇవాళ పాజిటివ్ రోగులకే నిర్వాహకులు మందు పంపిణీ చేస్తామంటున్నారు. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మందును పంపిణీ చేశారు. కొవిడ్ నిబంధనలకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. పోలీసులు జనాన్ని అదుపు చేస్తున్నారు.
ఇది అశాస్త్రీయం అని చెబుతున్న అధికారులు.. మందు తీసుకున్న వారిని విచారించామని, ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదని తమ నివేదికలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వలేదు. అయితే, ఈ ఆయుర్వేద మందు పంపిణీకి తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత 15 రోజుల్లోనే సుమారు 50 వేల మంది ఔషధం కోసం వచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో మందు పంపిణీ నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. మాస్కులు లేకుండా క్యూలో ఉండటం, కొవిడ్ నిబందనలు పాటించకపోవడం, వైరస్ సోకిన వ్యక్తులు రావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మందు పంపిణీని నిలిపివేశారు.
ఆనందయ్య అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా అనేక వ్యాధులకు వన మూలికలతో తయారు చేసిన ఆయుర్వేద మందులు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో దానికి సైతం మందు తయారు చేశారు. అల్లం, తాటి బెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్టా, లవంగాలు, వేప ఆకులు, నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, నేల ఉసిరి, కొండ పల్లేరుకాయలు, బుడ్డ బుడస ఆకులు, పిప్పింట ఆకులు, తెల్లజిల్లేడు, పూల మొగ్గలు, ముళ్ల వంకాయలతో ఔషధం తయారు చేశారు. ఆయుర్వేద మందు పేరుతో నాటు మందు తయారు చేసి ప్రజలకు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఈ ఆయుర్వేద మందులు చాలా బాగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవని కరోనా వచ్చిన వారు కూడా ఆరోగ్యకరంగా ఉంటున్నారని చెపుతున్నారు.
ఏపీతో పాటు తమిళనాడు, తెలంగాణ నుంచి సైతం ప్రజలు భారీగా తరలిరావడంతో అధికారులు స్పందించారు. పంచాయతీరాజ్, వైద్యారోగ్యశాఖ, ఆర్డీవో, ఆయుర్వేద వైద్యులు, స్థానిక ఎండీవో, తహసీల్దార్ మొదలైన జిల్లా స్థాయి అధికారులు విచారణ జరిపారు. వారి నివేదికను కలెక్టర్ చక్రధర్ బాబు లోకాయుక్తకు ఇచ్చారు. మందు వాడిన బాధితులతో మాట్లాడామని.. అందరూ ఆయుర్వేద మందుపై పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారని అందులో వెల్లడించారు. ఈ ఔషధంతో ఎలాంటి ఇబ్బంది పడలేదని చెప్పారు. ఆయుర్వేద చికిత్స ప్రక్రియ శాస్త్రీయంగా నిరూపితం కావాల్సి ఉందన్నారు. వైద్యం, మందులు అందించే చోట కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని పేర్కొన్నారు.
అయితే ఈ మందు విషయంలో డాక్టర్లు ప్రజలను హెచ్చరిస్తున్నారు. శాస్త్రీయంగా రుజువుకాని మందులు లేహ్యాలు వాడటం ద్వారా కరోనా ఏమోగానీ ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ చేసకుండా.., అసలు దాని ప్రయోజనం ఎంత వరకు ఉంటుందో తెలియకుండానే జనాలు ఎగబడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని చెబుతున్నారు. వైరస్ వచ్చిన వారు రాని వారు అక్కడకు చేరుకోవడం వల్ల వైరస్ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు.
మరోవైపు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కరోనా పాజిటివ్ వచ్చిన వారు వేల సంఖ్యలో గ్రామంలోకి రావడంతో గ్రామస్తుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వేల సంఖ్యలో జనం రావడంతో వారిని పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. కృష్ణపట్నం కాకుండా వేరే ప్రాతంలో పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: కరోనాకు ఆయుర్వేద మందు… ఆ నివేదికలో ఏముంది?