Tuesday, November 26, 2024

హుజురాబాద్ బరిలో కొండా.. టీ.పీసీసీ ఆలోచన ఏంటో?

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎవరు ఉంటారు? అన్నది ఒకటి,రెండు రోజుల్లో క్లారిటి రానుంది. మాజీ మంత్రి కొండా సురేఖకు టికెట్ ఖాయం అయిందని ప్రచారం జరుగుతున్నా.. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దీంతో టికెట్ ఎవరికి ఇస్తారు? అన్నది పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. హుజురాబాద్ బరిలో ఉంటే పేర్లను సిద్ధం చేసిన టీ.పీసీసీ… ఆ జాబితాను అధిష్ఠానానికి ప్రతిపాదించనుంది. అభ్యర్థిగా బీసీ వర్గం నుం చి కొండా సురేఖ, ఎస్సీ వర్గం నుంచి స్థాని క కాంగ్రెస్‌ నేత తిప్పారపు సంపత్‌, ఓసీ వర్గం నుంచి  పత్తి కృష్ణారెడ్డి పేర్లను ప్రతిపాదిస్తూ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మ న్‌.. టీపీసీసీకి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీనిపై పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి ఠాగూర్‌ .. రాజనర్సింహతో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ముగ్గురిలో ఒక్క పే రునే ఎంపిక చేసి అధిష్ఠానానికి పంపుతారా? లేక ముగ్గురి పేర్లను పంపుతారా? అన్న దానిపై స్పష్టత లేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కొండా సురేఖ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో అధిష్ఠానం అనుమతితో ప్ర కటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి బీసీ వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ కూడా బీసీ వర్గానికి చెందిన వారినే అభ్యర్థిగా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొండా సురేఖకు టికెట్ ఖాయం అయినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ పద్మశాలి సామాజికవర్గానికి చెందినవారు కాగా ఆమె భర్త మురళి కాపు సామాజికవర్గానికి చెందినవారు. ఈ రెండు సామాజికవర్గాలకు 55 వేల పైచిలుకు ఓట్లు ఉండడం కలిసివచ్చే అంశంగా కాంగ్రెస్‌ నేతలు భావించినట్లు సమాచారం. ఈటల రాజేందర్‌ ముదిరాజ్‌ వర్గానికి చెందినవారు కాగా.. గెల్లు శ్రీనివాస్‌ యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. నియోజకవర్గంలో ముదిరాజ్‌ల ఓట్లు 23,220 ఉండగా, యాదవ సామాజికవర్గానికి 22,150 ఓట్లు ఉన్నాయి. కొండా సురేఖను పోటీలో నిలిపితే కాపు, పద్మశాలి రెండు సామాజికవర్గాల నుంచి ఓట్లు పొందే అవకాశం ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా 20 నుంచి 30 వేల వరకు సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉంటూ వస్తున్నదని, కొండా సురేఖను బరిలో దింపడం ద్వారా బలమైన పోటీ ఇవ్వవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

అయితే, కొండా సురేఖకు టికెట్ ఇవ్వడంపై కొందరు నేతలు అభ్యతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ కు చెందిన స్థానిక నేతనే బరిలో దింపాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిజానికి ఈ నె ల 18నే కొండా సురేఖ పేరును ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, స్థానికులకే ఇవ్వాలని డిమాండ్లు రావడంతో వాయిదా పడింది.

మరోవైపు హుజూరాబాద్‌లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటిస్తూ 2023 ఎన్నికల్లో కూడా తనకే టికెట్‌ ఇవ్వాలని కొండా సురేఖ అధిష్ఠానం వద్ద ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ లో ఓటమి పాలైనా.. బలం పెంచుకోగలిగి వచ్చే ఎన్నికల నాటికి గట్టి పోటీదారుగా మారవచ్చనే ఉద్దేశంతోనే ఆమె వచ్చే ఎన్నికల్లో కూడా తనకే టికెట్‌ ఇవ్వాలనే డిమాండ్‌ను అధిష్ఠానం ముందుంచినట్లు సమాచారం. ఈ డిమాండ్‌తోపాటు వరంగల్‌ అర్బన్‌, పరకాల, జయశంకర్‌ భూపాలపల్లి టికెట్లను కూడా తాము సూచించినవారికి ఇవ్వాలని కూడా ఆమె షరతు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు బలం చూపిస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండిః వాచ్‌ మెన్‌గా మారిన సర్పంచ్!

Advertisement

తాజా వార్తలు

Advertisement