కొమురవెల్లి : కోరిన కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులుతీరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు.. మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు మల్లన్న కల్యాణంతో ప్రారంభమయ్యాయి.
యేటా మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామి వారి కల్యాణం జరగడం ఆనవాయితీగా వస్తుంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఆలయ ప్రాంగణం, చుట్టూ పక్కల అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలు, స్థానిక జనగామ శాసన సభ్యులు శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, భువనగిరి ఏంపీ శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి రోజా రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక సదుపాయ అభివృద్ది సంస్థ చైర్మన్ శ్రీఎర్రోల్ల శ్రీనివాస్, రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..