Wednesday, November 20, 2024

కాంగ్రెస్ దళిత దండోరా సభ వాయిదా ?: రేవంత్ కి కోమటిరెడ్డి సహకరిస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన దళిత, గిరిజన దండోరా రెండో సభ వాయిదా పడనుందా? కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సభకు హజరవుతారా? ఇప్పుడు దీనిపైనే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంద్రవెల్లి సభ విజయంతో రెండో సభకు రెడీ అవుతున్న రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రూపంలో ఝలక్ తగిలింది. రాష్ట్రంలో పార్టీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కొంత మంది సీనియర్లు సహకరించడం లేదు. ఈ క్రమంలోనే ఇటీవల రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత, గిరిజన దండోరా సభకు కూడా కోమటిరెడ్డి సహా చాలా మంది సీనియర్లు గైర్హాజరయ్యారు. దీంతో ఇంకా టీపీసీసీ మంటలు చల్లారలేదన్న వాదనలు వినిపించాయి.  

టీపీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రస్తుతం నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పజెప్పడంపై బాహాటంగానే తన అసమ్మతిని వెళ్లగక్కారు. అయితే, అనంతరం ఆయన సైలెంట్ అయ్యారు. పార్టీ పరంగా చేపడుతున్న పలు కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అయితే ఇంద్రవెల్లి సభ విజయవంతం కావడంతో ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో మరో సభ నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.

అయితే, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. దీంతో అక్కడ సభ ఏర్పాటు చేస్తే కోమటిరెడ్డి సహకరిస్తారా? లేక హాజరుకాకుండా దూరంగా ఉంటారా? అనే అనుమానాలు లేవనెత్తాయి. ఈ సభకు కోమటిరెడ్డిని రప్పించి.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవనే సంకేతాన్ని పంపాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ భావించారు. అయితే, ఇంతలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఊహించని షాకిచ్చారు. రేవంత్‌కి ఫోన్ చేసిన కోమటిరెడ్డి ఇబ్రహీంపట్నం సభను వాయిదా వేయాలని కోరినట్లు సమాచారం.

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఈ నెల 17 నుంచి 21 వరకూ స్టడీ టూర్‌కి వెళ్లాల్సి ఉందని.. అందువల్ల తన నియోజకవర్గ పరిధిలో నిర్వహించ తలపెట్టిన సభను వాయిదా వేయాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో రేవంత్ సభను వాయిదా వేస్తారా? లేక షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. అయితే, సభకు హాజరు కావడం ఇష్టం లేకనే ఆయన వాయిదా ప్రతిపాదన ముందుకు తెచ్చారని వాదనలు వినిపిస్తున్నాయి. గతంలోనూ పలు సందర్భాల్లో రేవంత్.. కోమటిరెడ్డికి ఫోన్ చేయగా.. ఆయన స్పందించలేదు. రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఇటీవల కోమటిరెడ్డి ప్రకటించారు. ఒకవేళ ఇబ్రహీంపట్నంలో సభ నిర్వహిస్తే… తన విజ్ఞప్తిని పట్టించుకోలేదంటూ కోమటిరెడ్డి మరోసారి సీరియస్ అయ్యే అవకాశముంది. ఫలితంగా కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య గ్యాప్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ నష్టం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇది కూడా చదవండిః ఏపీ సర్కార్ ఆలోచనలు దరిద్రం: రఘురామ సెటైర్

Advertisement

తాజా వార్తలు

Advertisement