రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వేళ.. టీ.పీసీసీలో ఉన్న అంతర్గత విభేదాలు బయట పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు వరంగల్లో నిర్వహించే రాహుల్ గాంధీ సభకు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నట్లు సమాచారం. రాహుల్ సభకు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో వారం రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరితోపాటు, ఇతర నాయకులు హనుమకొండలో బిజీగా గడుపుతున్నారు. అయితే, రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్టుగానే ఉన్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వమంతా ఇటీవల ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ అధిష్టానం నిర్ణయంతో అసంతృప్తితో ఉన్నారు. అయితే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ స్టార్ క్యాంపెనర్ గా ఎంపిక కావడంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే, రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ పూర్తిగా స్థాయిలో పాల్గొనడం లేదు. ఈ క్రమంలో ఆయన బీజేపీలోకి వెళ్తారంటూ గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, రాహుల్ సభకు రాజగోపాల్ రెడ్డి ఉంటారనే వార్త ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది.