తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని సీఎం కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఆయన అమరత్వం అందించిన చైతన్య స్ఫూర్తి.. మలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ కొనసాగిందని సీఎం అన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనకోసం పార్లమెంటరీ పంథాలో సాగిన శాంతియుత పోరాటంలో సబ్బండ వర్గాలు తమ వంతుగా ఉద్యమించాయని, తమ ఆకాంక్షలను చాటడంలో దొడ్డి కొమరయ్య స్ఫూర్తి ఇమిడి వున్నదని వెల్లడించారు. దొడ్డి కొమురయ్య త్యాగానికి గుర్తుగా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ వారికి ఘన నివాళులర్పిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.
అమరవీరుల త్యాగాలను తెలంగాణ ప్రభుత్వం నిత్యం స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకోసం శ్రమిస్తున్నదని తెలిపారు.నాటి సాయుధపోరాట కాలం నుంచి నేటి మలి దశ తెలంగాణ ఉద్యమకాలం దాకా దొడ్డి కొమురయ్య వంటి తెలంగాణ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధనలో ముందుకు సాగుతున్నామని సీఎం అన్నారు. అమరుల సంస్మరణార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమర జ్యోతి త్వరలోప్రారంభం కానున్నదని చెప్పారు. నేడు దేశ అర్థిక వ్యవస్థకే వెన్నుదన్నునందించే రీతిలో తెలంగాణ సబ్బండ కులాలు ముందంజలో ఉన్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు.