Tuesday, November 26, 2024

Followup: ప్రజలంతా బాగుండాలని కోరుకున్నా.. మహాలక్ష్మీ అమ్మవారి దర్శించుకున్న కేసీఆర్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన కొల్హాపూర్‌లోని అంబాబాయి మహాలక్ష్మీ అమ్మవారిని గురువారం ఉదయం సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌ నుంచి కుటుంబ సమేతంగా విమానంలో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ బయలుదేరి వెళ్లారు. కొల్హాపూర్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం కొల్హాపూర్‌ లోని అంబాబాయి మహాలక్ష్మీ ఆలయానికి చేరుకోగా, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో కార్వీర్‌ నివాసిని అంబాబాయి మహాలక్ష్మి అలంకార పూజలో సీఎం కేసీఆర్‌తోపాటు కుటుంబ సభ్యులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్‌ దంపతులతో పాటు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ , నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్‌ రావు, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌ కుమార్‌ రెడ్డి తదితరులున్నారు.

ఈ సందర్బంగా పూజల్లో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ లక్ష్మీదేవికి ప్రత్యేకించి ఉన్న ఆలయాల్లో కొల్హాపూర్‌ ఆలయం ముఖ్యమైంది. అమ్మవారి అష్టాదశ వక్తి పీఠాలలో ఏడవదిగా చెప్పుకునే ఈ ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుని ఆమె దీవెనలను కోరుకుంటారు. చాలా రోజులుగా నేను కూడా ఈ కోవెలకు రావాలని, అమ్మ ఆశీస్సులు తీసుకోవాలని అనుకుంటున్నా. ఇప్పటికి కుదిరి అమ్మవారి దర్శన భాగ్యం లభించింది. దేశం అభివృద్ధి పథంలో సాగాలని, రైతులు ఆనందగా ఉండాలని, ప్రజలంతా ఆరోగ్యంగా జీవించాలని అమ్మను కోరుకున్నాను అని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ పర్యటనలో గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాజీ గవర్నర్‌ , మహారాష్ట్ర సీనియర్‌ నాయకుడు డీ వై పాటిల్‌ , అయన మనుమడు … ప్రస్తుత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రుతురాజ్‌ పాటిల్‌ కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు సీఎం కేసీఆర్‌తో చర్చించారు. జాతీయ రాజకీయాలతోపాటు, ప్రస్తుతం దేవంలో నెలకొన్న అనేక రాజకీయ, రాజకీయేతర అంశాలపై చర్చించారు. కొల్హాపూర్‌ ఎయిర్‌పోర్టులో సీఎం కేసీఆర్ను అక్కడి ఎయిర్పోర్టు అథారిటీ డైరెక్టర్‌ కమల్‌ కటారియా ఘనంగా సత్కరించారు. సీఎం కేసీఆర్‌కు తలపాగా సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement