ఢిల్లీ – అధిష్టాన నిర్ణయమే తనకు శిరోధార్యమని, తనకు పార్టీయే ముఖ్యమని తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి .. అధ్యక్షుడిగా నియమితులైన అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, తాను పార్టీకి విధేయుడనని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని కిషన్ రెడ్డి అన్నారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు తాను ముందుకు సాగుతానని చెప్పారు. జులై 8న వరంగల్ లో ప్రధాని నరేంద్ర మోడీ సభ తర్వాత అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నట్లు తెలిపారు.
తెలంగాణకు మోడీ వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారని, దానికి భూమి పూజ చేసేందుకు ఆయన 8న వరంగల్ కు వస్తున్నట్లు చెప్పారు.. ఈ కోచ్ ఫ్యాక్టరీ వల్ల అయిదు వేల మందికిపైగా ఉపాధికలగనుందని చెప్పారు.. మరో ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, కేంద్రమంత్రి పదవికి సంబంధించి అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ రోజు ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. అయితే తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే క్యాబినేట్ మీటింగ్ కు హాజరుకాలేకపోయానని కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు.