Tuesday, November 26, 2024

కిర‌ణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుండి పిలుపు – ఏపీలో కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌విపై చ‌ర్చ‌ !

కాంగ్రెస్ అధిష్టానం నుండి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆఖ‌రి సీఎం ..కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డికి పిలుపు వ‌చ్చింది. ఈ మేర‌కు ఆయ‌న ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలో గడపనున్నారు. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా, ముఖ్యమంత్రిగా ఓ వెలుగు వెలిగారు కిరణ్ కుమార్ రెడ్డి.. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తర్వాత, జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి దారుణ ఓటమి చవిచూశారు. తర్వాత క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం మేరకు 2018లో కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ బలోపేతానికి తన వంతు ప్రయత్నిస్తానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. కానీ, కొద్ది రోజులకే తన సోదరుడు తెలుగు దేశం పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీపై అప్పటికి ప్రజల్లో పెద్దగా సానుకూలత లేకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి అంతగా యాక్టివ్ కాలేదు. రాష్ట్రస్థాయిలో పార్టీ పదవులు స్వీకరించాలని కోరిన పెద్దగా ఆసక్తి చూపలేదు. కిరణ్ కుమార్ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా..లేరా అనే సందేహాలు కూడా చాలా మందిలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. 2018లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చినా సైలెంట్‌గానే ఉంటున్నారు.

ఈ క్రమంలో ఉన్నట్లుండి కాంగ్రెస్ అధిష్టానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డికి పిలుపు వచ్చింది. దీంతో ఢిల్లీ వెళ్లనున్న కిరణ్.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్‌ గాంధీతో పాటు పార్టీలోని పెద్దలను ఆయన కలవనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ పూర్వవైభవానికి తీసుకోవాల్సిన చర్యలపై కిరణ్‌కుమార్‌రెడ్డితో పార్టీ పెద్దలు చర్చించే అవకాశముందని తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం త్వరలోనే ఖాళీ కానుంది. కిరణ్ కుమార్ రెడ్డి సన్నిహితుడైన సాకె శైలజానాథ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే, శైలజానాథ్ పదవీ కాలం ఇప్పటికే ముగిసిపోయినా.. పార్టీ పగ్గాలు చేపట్లే బలమైన నాయకుడు లేకపోవడంతో ప్రస్తుతానికి ఆయనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బలమైన నాయకత్వం కోసం కాంగ్రెస్ అధిష్టానం ఎదురుచూస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని కోరినా పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రస్తుత కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోసారి ఈ ప్రతిపాదన తీసుకొస్తుందేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement