కిలో ప్లాస్టిక్ ని తీసుకువస్తే వేడి వేడి తడి అటుకులు తినొచ్చు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ తయారీ, దిగుమతి, నిల్వ, అమ్మకాలను జూలై 1 నుంచి పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా నిషేధించింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొని వినియోగదారులకు ఇష్టమైన ఆహారాన్ని ఇచ్చే కేఫ్ వెలిసింది. జునాగఢ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ‘నేచురల్ ప్లాస్టిక్ కేఫ్’ అనే పేరుతో ఓ హోటల్‌ను ప్రారంభించింది. ఇక్కడ టిఫిన్ చేయాలంటే పైసలకు బదులుగా ప్లాస్టిక్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. కిలో ప్లాస్టిక్ తీసుకొస్తే వేడివేడి తడి అటుకులు తినొచ్చు. ఈ కేఫ్‌ను ‘సర్వోదయ్ సఖి మండల్’కు చెందిన మహిళల బృందం నిర్వహిస్తుంది.
కేఫ్ అభివృద్ధికి గ్రూప్ రూ. 50,000 అందించింది. ప్రజలు తమ ఇంటినుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకురావచ్చు. దాని బరువును బట్టి మెనూలోని ఆహార పదార్థాలను కొనుగోలు చేయవచ్చు. కేఫ్ ద్వారా సేకరించిన వ్యర్థాలు జునాగఢ్ పరిపాలనతో టై-అప్ ఉన్న రీసైక్లింగ్ ఏజెన్సీకి వెళ్తాయి. క్లీన్ అండ్ గ్రీన్ జునాగఢ్‌లో భాగంగా ఈ కేఫ్‌ను ప్రారంభించినట్లు ఆ జిల్లా కలెక్టర్ రచిత్‌రాజ్ తెలిపారు. 500 గ్రాంల ప్లాస్టిక్ వ్యర్థాలకు ఒక గ్లాసు నిమ్మరసం ఇస్తామన్నారు. కిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకొస్తే ఒక ప్లేట్ ధోక్లా లేదా పోహా అందిస్తామని చెప్పారు. కేఫ్ మెనూలో వివిధ రకాల సాంప్రదాయ గుజరాతీ వంటకాలు ఉంటాయని వివరించారు. అన్ని వంటకాలను మట్టి పాత్రల్లోనే వడ్డిస్తారని తెలిపారు.