మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడీస సినిమాకు గట్టి షాక్ తగిలింది. ఈ మూవీ దర్శక నిర్మాతలపై బాలీవుడ్ నిర్మాత రతన్ జైన్ కోర్టుకెక్కారు. తన అనుమతి లేకుండా బాలీవుడ్ హిట్ మూవీ ‘ఖిలాడీ’ టైటిల్‌ను వాడుకున్నారని ఢిల్లీ హైకోర్టులో ఆయన కేసు వేశారు. తానేమీ డబ్బులు ఆశించట్లేదని.. సినిమా టైటిల్ మార్చాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నానని రతన్ జైన్ చెబుతున్నారు. ఖిలాడీ నిర్మాతతో పాటు సమర్పకులపై కేసు వేసినట్లు రతన్ జైన్ తెలిపారు.
హిందీ వెర్షన్‌తో పాటు తెలుగు వెర్షన్‌పై కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఎందుకింత ఆలస్యంగా కోర్టును ఆశ్రయించారన్న ప్రశ్నకు.. తమ వైపు నుంచి ఎలాంటి జాప్యం జరగలేదని రతన్ జైన్ పేర్కొన్నారు. తమ ఉద్దేశం సినిమాను అడ్డుకోవడం కాదని స్పష్టం చేశారు. ఖిలాడీ సినిమా విడుదల తేదీ ఫిబ్రవరి 11 కాగా.. ట్రైలర్‌ను ఆలస్యంగా ఫిబ్రవరి 8న విడుదల చేయడంలో ఆంతర్యమేంటో అర్థం కాలేదన్నారు. ఫిలిం మేకర్స్ కాపీ రైట్ చట్టాన్ని ఫాలో కావాలని రతన్ జైన్ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అక్షయ్ కుమార్ ఖిలాడీ (1992) సినిమా కోసం గూగుల్‌లో ఎవరైనా సెర్చ్ చేస్తే.. అది రవితేజ ఖిలాడీ మూవీ రిజల్ట్స్ చూపిస్తోందన్నారు.
దక్షిణాది ఫిలిం మేకర్స్ సౌత్ అసోసియేషన్‌లో టైటిల్ రిజిస్టర్ చేయించి… అదే టైటిల్‌తో హిందీలోనూ రిలీజ్ చేయడం వల్ల సమస్య ఏర్పడుతోందన్నారు. అక్షయ్ కుమార్‌తో తాను నిర్మించిన ‘ఖిలాడీ’ టైటిల్‌ను ట్రేడ్ మార్క్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయించానని.. అదే టైటిల్‌తో రవితేజ సినిమాను విడుదల చేయడం సరికాదని అన్నారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని.. తదుపరి విచారణ ఫిబ్రవరి 16న జరుగుతుందని వెల్లడించారు. కాగా, రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా ‘ఖిలాడీ’ సినిమా తెరకెక్కింది. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 11) విడుదలైన ఖిలాడీ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.