– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, పీసీసీ ప్రతినిధులంతా కలిసి మొత్తం 9 వేల మందికిపైగా ఉన్నారు. వీరంతా రేపు (సోమవారం) జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ ఆఫీసులు, ఏఐసీసీ కేంద్ర కార్యాలయం, భారత్ జోడో యాత్ర క్యాంప్‌లో కూడా పోలింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. భారత్ జోడో యాత్ర క్యాంప్‌లో పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ సహా పలువురు లీడర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
ప్రతి రాష్ట్రానికి ఒక రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా పలువురు నేతలను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఎంపిక చేసింది. తెలంగాణకు రిటర్నింగ్ అధికారిగా కేరళ నేత రాజమోహన్ ఉన్నితన్, ఢిల్లీ రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. వారి పర్యటనల్లో ఆయా రాష్ట్రాల పీసీసీ ప్రతినిధుల ఆదరణ చూరగొనే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో కర్నాటకకు చెందిన మల్లిఖార్జున ఖర్గే ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎక్కువ మంది సీనియర్లు ఆయనకే సపోర్టు చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో థరూర్ పలు ఆరోపణలు చేసినా.. తాము ఎవరి పక్షాన లేమని గాంధీ కుటుంబం స్పష్టం చేసింది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సీరియల్ నంబర్లు ఆధారంగా కాకుండా తమకు నచ్చిన పేరు ఎదురుగా టిక్ పెట్టేటట్లు ఎన్నికల నిబంధనను సడలించాలని శశిథరూర్ మద్దతుదారులు కోరారు. అంతకుముందు మల్లిఖార్జున ఖర్గేకు సీరియల్ నంబరు 1 రాగా.. శశిథరూర్‌కు 2 నంబరు వచ్చింది. దీన్ని థరూర్ వర్గీయులు వ్యతిరేకించారు. బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్ 1లో ఖర్గే.. సీరియల్ నంబర్ 2లో శశిథరూర్ అని ఉండడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతారని తెలిపారు.
గెలుపు అంచనాలు.. వాదోపవాదనలు
ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్టీ హైకమాండ్ మద్దతు మల్లిఖార్జున ఖర్గేకే ఉందని ఆయననే విజయం వరిస్తుందని చాలామంది అనుకుంటున్నారు. మొదటి నుంచి పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఖర్గేకే అధ్యక్ష పీఠం దక్కుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఖర్గే వివాదరహితుడిగా కూరు ఉండడమే ఆయన గెలుపునకు ఈజీ అవుతుందంటున్నారు. అట్లనే.. సోనియా గాంధీ అప్పగించిన కార్యక్రమాలను ఎదురుచెప్పకుండా నిర్వర్తిస్తారనే పేరు కూడా ఉంది. దళిత వర్గానికి చెందిన వ్యక్తి కావడం కూడా కొంత ప్లస్ పాయింట్‌గా మారనుంది . పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, అశోక్ గెహ్లోత్, మనీశ్ తివారీ, ఆనంద్ శర్మ వంటి లీడర్ల సపోర్ట్ కూడా ఖర్గేకే ఉందని తెలుస్తోంది.
కాగా, అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న శశి థరూర్.. కాంగ్రెస్‌లో ఉన్న తెలివైన లీడర్లలో ఒకరు. సమయోచితంగా ఆలోచిస్తూ మాట్లాడే వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది. పట్టణవాసులు, చదువుకున్న వారిలో శశిథరూర్‌కు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న అతికొద్దిమంది కాంగ్రెస్ లీడర్లలో శశిథరూర్ ఒకరు. ప్రస్తుతం తిరువనంతపురం ఎంపీగా ఉన్నారు. దక్షిణాదికి చెందిన వ్యక్తి కావడం ఆయన మైనస్ పాయింట్. అనేక మంది కాంగ్రెస్ నేతల మాదిరిగా.. ఉత్తరాది రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడం శశిథరూర్‌కు కష్టమే కావొచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కనబెడితే.. కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాసిన జీ23 బృందంలో శశిథరూర్ కూడా ఉన్నారు. ఇది ఆయనకు ప్రతికూలంగా మారే చాన్స్ ఉంది.