Friday, November 22, 2024

ఖ‌మ్మం శ్రీ చైత‌న్య‌లో దారుణం – వేధింపుల‌తో టెన్త్ విద్యార్ధిని ఆత్మహ‌త్యాయ‌త్నం..

ఉమ్మడి ఖమ్మం, ప్రభన్యూస్‌ బ్యూరో: రాష్ట్రంలో పలు చోట్ల శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో విద్యార్థులు, తల్లిదండ్రుల పట్ల యాజ మాన్యాల వేధింపుల పర్వం నిరంతరం కొనసాగుతూనే ఉంది. నిన్న హైదరాబాద్‌లోని నార్సింగ్‌లో జరిగిన విద్యార్ధి ఆత్మహత్యా యత్నం సంఘటన తరహాలోనే రాష్ట్రంలో పలు చోట్ల ఉన్న శ్రీ చైతన్య కళాశాలలు, టెక్నో స్కూళ్లలలో ఫీజుల వేధింపులు, అరాచ కాలు జరుగుతూనే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా ఖమ్మం నగరంలో చోటుచేసుకున్న పదవ తరగతి విద్యార్థిని సాయి శరణ్య ఆత్మహత్యా సంఘటన అందుకు నిదర్శనంగా ఉంది. ఖమ్మం నగరంలోని ఇల్లందు రోడ్డు ఎన్‌టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని సాయి శరణ్య రాత్రి 8గంటల సమయంలో మూడంతస్తుల భవనం నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

చుట్టుపక్కల వారు, రోడ్డున పోయే వారు, పాఠశాల ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర గాయాలతో ఉన్న ఆ చిన్నారిని హుటాహుటిన ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మూడంతస్తుల భవనం నుండి పడడంతో నడుముకి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతుండగా, సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకులు, కార్యకర్తలు శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో విద్యార్ధుల వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేస్తూ నిరసన, ధర్నా నిర్వహించారు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ అద్దాలు పగులగొట్టి, ప్లెక్సీలు చించి వేశారు. మరో విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి కారణమైన శ్రీ చైతన్య యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా, సాయి శరణ్య భవనం నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటనను స్కూల్‌ యాజమాన్యం గోప్యంగా ఉంచడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని జయనగర్‌ కాలనీ ప్రాంతంలో ఉంటున్న విద్యార్థిని తల్లిదండ్రులు సంఘటన జరిగిన విషయం తెలియడంతో హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. తల్లిదండ్రులు బయటకు రాకుండా, గాయాలకు గురైన విద్యార్థిని వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం గమనార్హం.

పీడీఎస్‌యు విద్యార్ధి సంఘం ఆందోళన
శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ మూడంతస్తుల భవనం నుండి విద్యార్ధిని సాయి శరణ్య ఆత్మహత్యాసంఘటన తెలిసిన వెంటనే పీడీఎస్‌యు విద్యార్ధి సం ఘం నాయకులు, కార్యకర్తలు టెక్నో స్కూల్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ప్లెక్సీలు చించివేసి లోనికి ప్రవేశించి కుర్చీలు విరగ్గొట్టారు. అద్దాలు పగులకొట్టి ధ్వంసం చేశారు. విద్యార్ధుల పట్ల వేధింపులు ఆపాటని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement