Wednesday, November 20, 2024

Khammam – మిర్చి రేటు ఢ‌మాల్‌ .. ఒక్క రోజులోనే రూ.16,500కి పడిపోయిన ధర

తెలంగాణ‌లో రెండో అతి పెద్ద మిర్చి మార్కెట్ ఖ‌మ్మంలో ఉంది. ఇక్క‌డికి ఖ‌మ్మం జిల్లా రైతుల‌తోపాటు వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ జిల్లాలవారు.. ఆ పక్కనే ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతులు కూడా మిర్చి బస్తాలతో వస్తారు. అయితే.. మొన్నటిదాకా మంచి రేటు పలికిన మిర్చి.. ఒక్కసారిగా ధర పడిపోయింది. దీనికి అంత‌ర్జాతీయంగా ఎగుమ‌తులు తగ్గడమే అని వ్యాపారులు అంటున్నారు. దీంతో ఒక్కసారిగా క్వింటాలు మిర్చి ధర 6500 తగ్గడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఖమ్మం – అంతర్జాతీయంగా మిర్చి ఎగుమతులు పడిపోవడంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎండు మిర్చి ధ‌ర‌ పడిపోయింది. ఈ సీజ‌న్‌లో క్వింటా మిర్చి ధ‌ర రూ.23 వేలకు పైగా ప‌లుకుతుంది. అయితే ఈ ఏడాది రూ. 16,500 కు పడిపోయింది. ఒకేసారి క్వింటాకు రూ. 6,500 త‌గ్గిపోవ‌డంతో తాము తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో వరంగల్ ఏనుమాముల మార్కెట్ తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్ గా ఖ‌మ్మం మార్కెట్ యార్డుకు ప్రాధాన్యం ఉంది. ప్రతి రోజూ వేల క్వింటాల‌ మిర్చి ఇక్క‌డ అమ్మ‌కాలు జ‌రుగుతుంటాయి. ఖమ్మం జిల్లాతోపాటు నల్గొండ , వరంగల్ జిల్లాల రైతులు, అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతులు కూడా ఇక్క‌డ‌కు మిర్చి తీసుకువ‌చ్చి అమ్ముతుంటారు.

అమ్మాలా వద్దా.. రైతుల స‌త‌మతం..

- Advertisement -

మిర్చి రేటు పడిపోవడంతో కోల్డ్ స్టోరేజీల్లో మిర్చి నిల్వ‌ చేసిన రైతుల‌కు భ‌యం పట్టుకుంది. మిర్చి రేట్ పెరుగుతుందా? లేదా? అనే ఆందోళన రైతుల్లో నెల్కొంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ప్రస్తుతం మిర్చి రేటు అత్యధికంగా రూ.16,500 కాగా, సాధారణ రకం మిర్చి రేటు రూ.10 వేలు పలుకుతోంది. మిర్చి మార్కెట్ మోడల్ రేటు రూ . 13,500 గా పలుకుతోంది. నాణ్యత సరిగా లేదని, కొంతమంది రైతుల వద్ద నుండి రూ. 10 వేలకే వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో రైతులు కుదేలు అవుతున్నారు. కోల్డ్ స్టోరేజ్‌ల్లో నిల్వ‌ చేసుకున్న రైతులకు తాజాగా రేటు పడిపోవడంతో ఏమి చేయాలో రైతులు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. రూ. 23 వేల రేటు ప‌లుకుతుంద‌ని కోల్డ్ స్టోరేజీలలో నిల్వ‌ చేసి మరింత రేటు కోసం నిరీక్షించిన రైతులు ప్రస్తుతం రేటు చూసి ఖంగుతిన్నారు. నిల్వ చేసిన మిర్చి అమ్ముకోవాలో, లేదో అని స‌త‌మ‌తమ‌వుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement