ఓ ఇంట్లో కొండ చిలువ దర్శనం
నిత్యావసర సరకులన్నీ నీటి పాలు
ఇంట్లో నుంచి దుర్వాసన
చుట్టుముట్టనున్న వ్యాధుల భయం
గోడలకు పట్టిన ఒండ్రు తొలగిస్తున్న బాధితులు
రహదారులు శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికులు
మినరల్ వాటర్ సరఫరా..
సహాయక చర్యలకు వర్షం ఆటంకం
ప్రభుత్వ పరిహారం చాలదంటున్న బాధితులు
ఆంధ్రప్రభ స్మార్ట్, ఖమ్మం :
ఖమ్మం నడిబొడ్డులో పారుతున్న మున్నేరు వాగు ఎన్నడూ లేనంత విధ్వాంసం సృష్టించింది. ముంపునకు గురైన మోతీనగర్, బొక్కల గడ్డ, వెంకటేశ్వర కాలనీ, సారథి నగర్, కరుణ గిరి, పోలేపల్లి, మారుతీనగర్ తదితర ప్రాంతాలకు చేరుకున్న బాధితులు తలలు పట్టుకున్నారు. ఎన్నో ఏళ్లగా ఉన్నా.. మున్నేరు ఉగ్ర రూపం దాల్చలేదు. ఇప్పుడు మున్నేరు కన్నేరకు సర్వం కోల్పోయి నిరాశ్రుయులయ్యారు.
ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న బాధితులు
ముంపు నుంచి తేలిన ఇళ్లను బాధితులు శుభ్రం చేసుకుంటున్నారు. వరదలో కొట్టుకొచ్చిన చెత్త ఓ ఇంటి కిటికీలో చిక్కింది. అలాగే ఓ ఇంట్లో మంచాలు, బీరువాలు చిందరవందర అయ్యాయి. దానికి తోడు నదిలోని వ్యర్థాలు ఇళ్లలోకి చేరుకున్నాయి. వరద పోటుకు ఇళ్లలో ఉన్న సామాన్లు రహదారులపై చిందరవందరగా పడ్డాయి. కొందరు బాధితులు తడిచిన సామాన్లును ఆర బెట్టుకుంటున్నారు. వరదల్లో కొట్టుకొచ్చిన గుర్రపుడెక్క, పిచ్చి మొక్కలు ఇళ్ల పరిసరాల్లో పేరుకుపోయాయి. ప్రభుత్వం వాటర్ ట్యాంక్ ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా… ఆ నీళ్లతో బాధితులు సామాన్లు శుభ్రం చేసుకుంటున్నారు. ఇంట్లో ఉన్న బురదను తొలగిస్తున్నారు.
ఓ ఇంట్లో కొండచిలువ
వరద తగ్గిన త్వరాత పద్మావతినగర్‌లోని ఒక ఇంట్లో కొండ చిలువ దర్శనం ఇచ్చింది. దీంతో ఆ ఇంటి నివాసితులు కేకలు వేసి బయటకు పరుగులు తీశారు. దీంతో స్థానికులు వెళ్లి ఆ కొండ చిలువను చంపి బయటకు తెచ్చారు. అలాగే విషపురుగులు ఇళ్లలో ఉంటాయని బాధితులు భయపడుతున్నారు. కొందరి ఇళ్లలో తేలు కనిపించాయి.
వర్షం ఆటంకం
ఖమ్మంలో వర్షం కురువడంతో ఇళ్లు, సామాన్లు, రహదారులు శుభ్రం చేసుకోవడానికి బాధితులు, పారిశుధ్య కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కడిగిన సామాన్లు ఎక్కడ ఆరబెట్టుకోవాలో అని వారు తలలు పట్టుకుంటున్నారు. ఇళ్లల నుంచి దుర్వాసన కూడా వస్తుందని బాధితులు చెబుతున్నారు.
రోడ్లు శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికులు
వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో రహదారులను పారిశుధ్య కార్మికులు శుభ్రం చేస్తున్నారు. జిల్లాలోని నలుమూలల నుంచి తీసుకు వచ్చిన కార్మికులతో రోడ్లపై పేరుకుపోయిన బురద, ఒండ్రు తొలగిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా తీసుకు వస్తున్న వాటర్‌తో శుభ్రం చేస్తున్నారు. అలాగే గుర్రపు దెక్కలను కూడా తొలగిస్తున్నారు.
నిత్యావసరుకులు నీటి పాలు
వరద నీటిలో నిత్యావసర సరుకులు కొట్టుకుపోయాయి. ప్రధానంగా ఇంట్లో ఉంచిన బియ్యం, పోపు దినుసులు, వంట నూనె, కొట్టుకుపోవడంతో కొత్తగా కొనుగోలు చేసుకునే పరిస్థితి దాపురించింది.
వ్యాధుల భయం
ముంపు నుంచి బయటపడిన ప్రాంతాల్లో వ్యాధులు వచ్చే అవకాశం ఉందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా విషజ్వరాలు విజృంభిస్తున్న సంగతి విదితమే. అయితే వరద నీటికి పేరుకుపోయిన చెత్తాచెదారం, అలాగే బురద పేరుకుపోవడం, వాటిపై దుర్గంధం వెదజల్లుతోంది. అలాగే దోమలు కూడా పెరిగాయి. వీటివల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని బాధితులు భయాందోళన చెందుతున్నారు. ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి విషజ్వరాలు రాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
పరిహారం చాలదు
ఇల్లు శుభ్రం చేయడానికి ప్రభుత్వం పది వేల రూపాయల పరిహారం ప్రకటించింది. అయితే ముంపు నుంచి బయటపడిన ఇళ్లల్లోకి ఒండ్రు బురద, చెత్తాచెదారం పేరుకుపోయింది. కనీసం పది రోజులపాటు శుభ్రం చేయాల్సి ఉంటుంది. బురద పట్టిన సామాన్లు శుభ్రం చేయడానికి, అలాగే ఇల్లు శుభ్రం చేయాలి. వీటికి ప్రభుత్వం ఇచ్చిన పరిహారం ఏ మాత్రం చాలదని బాధితులు అన్నారు.
మినరల్ వాటర్ సరఫరా
వరద బాధితులకు మినరల్ వాటర్ సరఫరా చేస్తున్నారు. వరద ముంపు గ్రామాల్లో వాటర్ తాగొద్దని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల వ్యాధులు వస్తాయని, మినరల్ వాటర్ మాత్రమే తాగాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి మినరల్ వాటర్ బాటి ళ్లు పంపిణీ చేస్తున్నారు.