కేజీఎఫ్ కి సీక్వెల్ గా తెరకెక్కింది కేజీఎఫ్2. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ చిత్రం కేజీఎఫ్ అంచనాలనను చేరుకుందో లేదో చూద్దాం..కేజీఎఫ్ చిత్రంలో గరుడ పాత్ర చనిపోయిన తరువాత ఏం జరిగింది అనే పాయింట్ నుంచి ఈ సెకండ్ పార్ట్ మొదలవుతుంది. ‘గరుడ’ను రాఖీ భాయ్ (యశ్) అంతం చేస్తాడు. దాంతో అతని స్థానంలోకి గరుడ సోదరుడు విరాట్ రావడానికి ట్రై చేస్తాడు. అతనిని కూడా చంపేసి ‘కేజీఎఫ్’ బంగారు గనులను రాఖీ తన అధీనంలోకి తెచ్చుకుంటాడు. అంతవరకూ అక్కడి గనుల్లో పనిచేస్తూ అణచివేతకు లోనైన అక్కడి కూలీలంతా, రాఖీ చూపించే మానవత్వానికి కరిగిపోతారు. తమ బతుకులకు భరోసాను ఇచ్చిన ఆయనను ఒక దేవుడిలా భావిస్తుంటారు. ఇక మొదట్లో రాఖీని అపార్థం చేసుకున్న రీనా (శ్రీనిధి శెట్టి) ఆ తరువాత అర్థాంగిగా ఆయన జీవితంలోకి అడుగుపెడుతుంది.’గరుడ’ తరువాత కేజీఎఫ్ పై తమ ఆధిపత్యం నడుస్తుందని ఆశపడిన ముగ్గురు వ్యక్తులు, రాఖీకి కి వ్యతిరేకంగా చక్రం తిప్పడం మొదలుపెడతారు. మరి ఆ వ్యూహాలు ఏంటనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
‘కేజీఎఫ్’ ను చూసిన వారికి ‘కేజీఎఫ్ 2’ ఎలా ఉంటుందనే విషయంలో కొంతవరకూ ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనాలకి తగినట్టుగానే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ కథను నడిపించాడు. ఒక వైపున తనని నమ్ముకున్న ప్రజలు .. మరో వైపున బంగారు గనులపై పట్టు కోసం కాచుకుని కూర్చున్న శత్రువులు .. ఇంకో వైపున బంగారం విషయంలో తన తల్లికి ఇచ్చిన మాట .. మరో వైపున తల్లి కాబోతున్న బంగారం వంటి భార్య .. ఈ నాలుగు ప్రధానమైన అంశాలను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. హీరో ప్రధానమైన శత్రువులను ఏరేసుకుంటూ వెళుతూ .. నేరుగా ప్రధానిని ఫేస్ చేసే స్థాయికి వెళ్లడంతో కథ పతాకస్థాయికి చేరుకుంటుంది.
ప్రశాంత్ నీల్ ప్రతి సన్నివేశాన్ని చాలా పట్టుగా రాసుకుని పెర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశాడు. బంగారు గనుల నేపథ్యంలో వచ్చే సీన్స్ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకునిపోతాయి. ఒక్కో శత్రువు ఆటకట్టిస్తూ రాఖీ భాయ్ ముందుకు వెళ్లే తీరును ఆసక్తికరంగా చూపించాడు. యష్ .. సంజయ్ దత్ .. రవీనా టాండన్ పాత్రలను డిజైన్ చేసిన తీరు బాగుంది. యశ్ పాత్రను ప్రశాంత్ నీల్ చాలా స్టైలీష్ గా చూపించాడు. తల్లికి ఇచ్చిన మాట కోసం .. అన్ని బంగారు గనులున్న ఆయన ఒక్క బంగారు బిస్కట్ ను కూడా వదులుకోకపోవడం .. తన ప్రియురాలు ఉక్కపోస్తుందంటే హెలికాఫ్టర్ ఫ్యాన్ తో గాలి వచ్చేలా చేయడం ఆ పాత్ర స్వభావానికి అద్దం పడతాయి. శత్రువుల పట్ల కనికరం లేకుండా విరుచుకుపడే ఆయనకి, స్త్రీల పట్ల గల గౌరవం ఏ స్థాయిలో ఉందో కూడా చూపించారు. ఇక ప్రకాశ్ రాజ్ .. రావు రమేశ్ పాత్రలు ఒక పరిథిలో కనిపిస్తాయి. ఎప్పటికప్పుడు యాక్షన్ కి ఎమోషన్ ను జోడిస్తూ, ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లడంలో ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడు.
ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు. ‘తుఫాన్’ .. ‘ధీర ధీర’ పాటలు సందర్భంలో నుంచే పుట్టుకుని వస్తాయి. ఇక శ్రీనిధి శెట్టి వైపు నుంచి సాగే ‘మెహబూబా’ పాట కూడా ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ఆయువు పట్టు. ఆ వైపు నుంచి రవి హండ్రెడ్ మార్కులు కొట్టేశాడు. భువన్ గౌడ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. బంగారు గనుల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు .. రెయిన్ ఫైట్ సీన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. కథాకథనాలు .. పాటలతో పాటు మాటల్లోను మంచి బలం కనిపిస్తుంది. ఈ సినిమా ఎడిటింగ్ కూడా అదిరిపోయింది. మొత్తానికి ఫస్ట్ రోజే హిట్ టాక్ తో దూసుకుపోతోంది కేజీఎఫ్2. కాగా కేజీఎఫ్3 కూడా రానుందనే టాక్ వినిపిస్తోంది. ఏమవుతుందో చూడాలి మరి.