కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నాయకురాలు ఆర్ బిందు మహిళల పట్ల పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబట్టారు. కొచ్చిలో జరిగిన సీపీఐ(ఎం) పార్టీ సమావేశంలో పార్టీలో పితృస్వామ్యం, మహిళా వ్యతిరేక వైఖరులు ఉన్నాయని బిందు ఆరోపించారు. మొన్న జరిగిన సంస్థ నివేదికపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఇలాంటి సమస్యలను ఎత్తిచూపినప్పుడు కూడా పరిష్కరించండం లేదని మంత్రి పేర్కొన్నారు. మహిళా నేతలు పార్టీలో సమస్యలను ఎదుర్కోవడం దురదృష్టకరమని, మహిళకు చేదు అనుభవాలు ఎదురైన ఘటనలపై చేసిన ఫిర్యాదులను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని బిందు అన్నారు.
అయితే.. అలప్పుజ ప్రతినిధులు కూడా ఆమె వాదనను సమర్థించారు. నివేదికపై బహిరంగ చర్చ సందర్భంగా అలప్పుజాలో మహిళా నాయకులకు తగిన మద్దతు లభించడం లేదని వారు అన్నారు. పలువురు మహిళా శాఖా కార్యదర్శులు ఉన్నా పితృస్వామ్య వైఖరి మాత్రం మారడం లేదన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడంలో పార్టీ తీరును వారు ఎత్తిచూపారు.