బెంగళూరులో 22 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. బైక్ టాక్సీ డ్రైవర్, అతని దోస్తు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదు మేరకు నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు ఇవ్వాల (మంగళవారం) తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన యువతి శుక్రవారం బెంగళూరుకు వచ్చింది. అర్ధరాత్రి సమయంలో తన స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు బైక్ ట్యాక్సీని బుక్ చేసుకుంది. రైడ్ షేరింగ్ అప్లికేషన్‌లో బైక్ బుక్ చేసుకునేటప్పుడు ఆ యువతి మద్యం మత్తులో ఉంది. డ్రైవర్ మహిళను ఆమె గమ్యస్థానానికి తీసుకెళ్లాడు. కానీ, ఆమె బైక్ దిగే పరిస్థితిలో లేదు.
దీంతో బైక్ డ్రైవర్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే మరో మహిళ ఉంది. దీంతో అతను తన స్నేహితుల్లో ఒకరిని ఇంటికి పిలిచాడు. వాళ్లిద్దరు కలిసి ఆ యువతిపై అత్యాచారం చేశారు. ఈ విషయంలో బైక్ డ్రైవర్ ఇంట్లో ఉన్న మహిళ కూడా నిందితులకు సహాయం చేసింది. ఆ మరుసటి రోజు ప్రాణాలతో బయటపడిన ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు తనపై జరిగిన అఘాయిత్యాన్ని గమనించింది. ఆమె నొప్పిని గుర్తించి సమీపంలోని ఆసుపత్రికి వెళ్లింది. కాగా, ఆ యువతిపై జరిగిన అత్యాచారం గురించి డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ క్రమంలో ఫిర్యాదు నమోదు చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా స్థలంలో పోలీసులు పరీక్ష నిర్వహించినట్లు కమిషనర్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఈ ఇద్దరు నిందితుల్లో ఇంతకుముందే ఒకరికి క్రిమినల్ రికార్డ్ ఉందని, నిందితుల నేపథ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారని ఆయన అన్నారు.