ఓ పోలీసు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..పోలీసా మజాకా అంటున్నారు నెటిజన్స్..విషయం ఏంటంటే..రోడ్డు పక్కన ద్విచక్రవాహనం పార్క్ చేసిన వ్యక్తి, ఎస్సైతో వాగ్వాదం జరిపి, ఆపై కత్తితో దాడికి యత్నించగా, ఆ ఎస్సై ఏమాత్రం భయపడకుండా ఆ వ్యక్తిని కిందపడేసి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కేరళలోని అళప్పుళ జిల్లాలోని నూరానాద్ పోలీస్ స్టేషన్ లో అరుణ్ కుమార్ ఎస్సైగా పనిచేస్తున్నారు. ఆయన తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పారా జంక్షన్ ప్రాంతంలో రోడ్డు పక్కన స్కూటీ పార్క్ చేసిన వ్యక్తి వద్ద తన వాహనం ఆపారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. అయితే, పోలీసు జీపు మరికాస్త ముందుకు వచ్చి ఆపగా, ఆ స్కూటీ వద్ద ఉన్న వ్యక్తి వేటకత్తి తీసి ఎస్సై అరుణ్ కుమార్ పై దాడికి యత్నించాడు.
అవతలి వ్యక్తి ప్రమాదకర రీతిలో కత్తి విసురుతున్నా, ఎస్సై అరుణ్ కుమార్ వెనక్కి తగ్గకుండా అతడిని ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ కిందపడిపోయారు. చివరికి ఎస్సై అరుణ్ కుమార్ ఆ వ్యక్తిని నేలకు అదిమిపట్టి కత్తిని లాగేసుకున్నారు. ఇంతలో స్థానికులు వచ్చి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులు తమ వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులపై దాడికి దిగిన ఆ వ్యక్తిని సుగతన్ (48) గా గుర్తించారు. నూరానాద్ ప్రాంతానికి చెందినవాడు. అతడి దాడిలో ఎస్సై అరుణ్ కుమార్ చేతికి గాయమైంది. ఆ గాయానికి ఏడు కుట్లు పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ వీడియోను ఓ వ్యక్తి చిత్రీకరించగా, దాన్ని పోలీసులు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతోంది.