– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) కోర్టు ఓ వ్యక్తికి విధించిన శిక్ష సంచలనంగా మారింది. 10ఏళ్ల చిన్నారిపై రెండేళ్లపాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో 41 ఏళ్ల వ్యక్తికి 142 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కేరళలోని పతనంతిట్టాలోని పోక్సో కోర్టు తీర్పువెలువరించింది. నిందితుడు జరిమానా చెల్లించకపోతే, అతను మరో మూడేళ్ల దాకా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది. అయితే.. ఇప్పటిదాకా పోక్సో కేసులో నిందితులకు విధించిన గరిష్ట కాలం శిక్ష ఇదే.
ఆనందన్ పీఆర్ అలియాస్ బాబు అనే వ్యక్తి లెక్క ప్రకారం రెమిషన్ ఆధారంగా ఇంకా 60 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. మార్చి 20, 2021న, తిరువళ్ల పోలీసులు 2019 , 2021 మధ్య 10 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసినందుకు.. ఆ రెండేళ్ల కాలంలో అనేకసార్లు క్రూరమైన రీతిలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతనిపై కేసు నమోదు చేశారు. బాబు బంధువు కావడంతో పిల్లల తల్లిదండ్రులతో కలిసి అదే నివాసంలో ఉండేవాడు. ఇదే అదనుగా తీసుకుని బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ప్రాసిక్యూషన్ తరఫున ప్రిన్సిపల్ పోక్సో ప్రాసిక్యూటర్ న్యాయవాది జేసన్ మాథ్యూస్ వాదనలు వినిపించారు.ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలు, మెడికల్ రికార్డులు, ఆధారాలు ప్రాసిక్యూషన్‌కు అనుకూలంగా ఉన్నాయని, తిరువళ్ల పోలీస్ ఇన్‌స్ పెక్టర్‌గా ఉన్న హరిలాల్ కేసు పక్కాగా నమోదు చేశారని పతనంతిట్ట జిల్లా పోలీసులు తెలిపారు. విచారణ జరిపి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. పోక్సో కింద నేరం రుజువు కావడంతో నిందితుడికి మొత్తం 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.. రూ. 5 లక్షల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.