కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేరళ మాజీ ఎంపీ జాయిస్ జార్జ్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఇడుక్కి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగించారు. రాహుల్ గాంధీ ఓ బ్యాచిలర్ అని, ఆయనతో జాగ్రత్తగా ఉండాలని కాలేజీ విద్యార్థినులను హెచ్చరించారు. రాహుల్ గాంధీ కేవలం మహిళల కాలేజీలకే వెళ్తారని, అక్కడికి వెళ్లి విద్యార్థినులను ఒంగమని చెప్తారని ఆరోపించారు. కానీ మీరు అలా చేయవద్దని.. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదంటూ జాయిస్ జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
కొచ్చిలో సెయింట్ థెరెసా కాలేజీ విద్యార్థినులకు ఈ మధ్య రాహుల్ గాంధీ ఐకిడో శిక్షణ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ జాయిస్ జార్జ్ ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. ఐకిడోలో నిపుణుడైన రాహుల్.. విద్యార్థునులు తమను తాము ఎలా రక్షించుకోవచ్చో చెప్తూ వాళ్లకు శిక్షణ ఇచ్చారు. దీనిపై జార్జ్ కామెంట్లు చేయడంపై కేరళ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల తీవ్రంగా ఖండించారు. రాహుల్‌తో పాటు మహిళలను కూడా జార్జ్ అవమానించారని, ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.