Friday, November 22, 2024

వరకట్నం కేసులో భర్తకు పదేండ్ల జైలు, 12.55 లక్షల జరిమానా.. కేరళ కోర్టు సంచలన తీర్పు

కేరళలో సంచలనంగా మారిన వైద్యవిద్యార్థిని ఆత్మహత్య కేసు కొలిక్కి వచ్చింది. తన భర్త ప్రవర్తనతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కోర్టులో రుజువైంది. అతని ఫోన్​ రికార్డులు, కాల్​ డేటా ఆధారంగా సైబర్​ క్రైమ్స్​ పోలీసులు ఈ ఆధారాలను రుజువు చేశారు. అయితే ఈ ఘటన గత ఏడాది జూన్​లో జరగగా 11 నెలల తర్వాత కేసులో దోషికి శిక్ష పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలేంటంటే..

2021 జూన్‌లో ఇంట్లోనే ఉరివేసుకుని వైద్య విద్యార్థిని విస్మయ ఆత్మహత్య చేసుకుంది. కాగా తన భర్త వేధింపులు, వరకట్నం తేలేదన్న ఇబ్బందులే దీనికి కారణంగా పోలీసులు నిరూపించారు. కాగా, ఈ కేసులో కేరళ కోర్టు ఇవ్వాల (మంగళవారం) దోషికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కొల్లాం జిల్లా కోర్టు విస్మయ భర్త అయిన కిరణ్ కుమార్‌కు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.12.55 లక్షల జరిమానా విధించింది.

అంతేకాకుండా కిరణ్ కుమార్‌కు వరకట్నం కేసులో ఆరేళ్ల జైలుశిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించారు. నగదు చెల్లించడంలో విఫలమైతే మరో ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది. ఇక గృహహింసకు పాల్పడినందుకు ఇదే కేసులో రెండేళ్ల జైలుశిక్ష, రూ.0.5 లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3 కింద కిరణ్ కుమార్‌కు ఆరేళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించింది కోర్టు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 18 నెలల జైలు శిక్ష విధిస్తారు.  వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 4 కింద ఏడాది జైలు శిక్ష, రూ. 5,000 జరిమానా విధిస్తూ కోర్టు ఆదేశించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో 15 రోజుల జైలు శిక్ష విధిస్తారు. అయితే ఈ తీర్పు అంతా ఏకకాలంలో అమలు అవుతుందని కోర్టు వెల్లడించింది.

కాగా, దోషికి విధించిన మొత్తం జరిమానా రూ.12.55 లక్షలు. విస్మయ తల్లిదండ్రులకు రెండు లక్షల రూపాయల నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే.. తన తండ్రికి మతిమరుపు ఉందని, అతని ఆరోగ్యం కారణంగా కాస్త వెసలుబాటు కల్పించాలని నిందితుడి తరపు న్యాయవాది వాదించారు. అతను కుటుంబానికి ఏకైక జీవనాధారమని, అతని తండ్రి వయస్సును పరిగణనలోకి తీసుకోవాలి కోరారు. కిరణ్ కుమార్‌కు ఎలాంటి నేర నేపథ్యం లేదని, ఇంతకు ముందు ఇతర కేసుల్లో కూడా ప్రమేయం లేదని ప్రతివాది తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.

అయితే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన కేసు కాదని ప్రాసిక్యూషన్ వాదించింది. ఇది సామాజిక దురాచారానికి,- వరకట్నానికి వ్యతిరేకంగా ఉన్న  కేసు. కట్నం అడిగిన కేసులో నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి. ఇక వైద్య విద్యార్థిని విస్మయ ఆత్మహత్య.. హత్యతో సమానమని, అందువల్ల తీర్పు ఆదర్శప్రాయంగా ఉండాలని ప్రాసిక్యూషన్ వాదించింది.

- Advertisement -

ఈ కేసులో కిరణ్ కుమార్ దోషి అని కోర్టు మే 23న తేల్చింది. అతను వరకట్న వేధింపు (IPC 304b), ఆత్మహత్యకు ప్రేరేపించడం (306), గృహ హింస (498A) నేరాలకు పాల్పడ్డాడు. ఈ తీర్పు నేపథ్యంలో మాజీ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ బెయిల్‌ను కోర్టు రద్దు చేసి జైలుకు పంపింది. ఈ కేసులో అరెస్టయిన కిరణ్ కుమార్‌ను ఆ తర్వాత సర్వీసు నుంచి తొలగించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement