ఓ యువ ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలపై కేరళకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎల్దోస్ కున్నప్పిల్లిపై మంగళవారం నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఎర్నాకుళంలోని పెరుంబవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కున్నప్పిల్లిపై అత్యాచారం, స్త్రీని అవమానించడం, కిడ్నాప్, చొరబాటు, కొట్టడం వంటి అభియోగాలను పోలీసులు మోపారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా తిరువనంతపురంలోని కోవలం పోలీసులు కున్నప్పిల్లిపై కేసు నమోదు చేశారు. అయితే.. పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా అస్వస్థతకు గురై ఎమ్మెల్యే అక్కడే కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ కేసులో ఎమ్మెల్యే నుంచి పోలీసులు పూర్తి వాంగ్మూలం తీసుకోవాల్సి ఉంది.
తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన కున్నపిల్లితో శారీరక సంబంధం ఉందని బాధితురాలు వాంగ్మూలంలో వెల్లడించింది. ఎమ్మెల్యే చేసిన నేరానికి సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని బాధితురాలు తెలిపింది. కోవలం పోలీసులపై కూడా బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యేపై ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని, ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని పోలీసులు కోరారని తెలిపింది. ఈ విషయంలో ఫిర్యాదు చేయొద్దని ఎస్హెచ్ఓ కోరారని బాధితురాలు చెప్పింది.
అయితే.. కోవలం పోలీసులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ లేడీ టీచర్ అసలు తమ పోలీస్ స్టేషన్‌కు రాలేదని చెప్పారు. ఆమె సెప్టెంబరు 29న నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా, భౌతిక దాడికి సంబంధించిన ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. తిరువనంతపురంలోని వాంచియూర్ కోర్టులో సోమవారం బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం కాపీ కోసం పోలీసులు దరఖాస్తు చేసుకున్నారు. దీని ఆధారంగా ఎల్దోస్ కున్నపిల్లిపై మరిన్ని అభియోగాలు నమోదు చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.