Tuesday, November 26, 2024

Kerala – దేవ‌భూమిలో విషాదం… 74 మంది సమాధి .. శిధిలాల కింద మరో 400 మంది


వ‌య‌నాడ్ భారీగా విరిగిప‌డిన కొండ చ‌రియ‌లు
శిధిలాలలో చిక్కుకున్న 500 కుటుంబాలు
ఇప్ప‌టికే 62 మృత దేహాలు వెలికి తీత‌
శిధిలాలలో 400 మందికి పైగా ట్రాప్
వ‌ర్షాల‌తో స‌హ‌య కార్య‌క్ర‌మాల‌కు ఆటంకం
దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన రాష్ర‌ప‌తి, ప్ర‌ధాని, విప‌క్ష నేత రాహుల్ గాంధీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – వ‌య‌నాడ్ – దేవభూమిగా పిలిచే కేర‌ళ‌లో ప్రకృతి కన్నెర్ర చేసింది.. ఎన్న‌డూ ఊహించ‌ని విషాదం చోటు చేసుకుంది. వయనాడ్‌ జిల్లా మెప్పాడి సమీపంలోని హిల్స్ ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు.. కొండ చ‌రియ‌లు విరిగిప‌డిన ప్రాంతంలో 500 కుటుంబాలు పైగా ఉంటున్న‌ట్లు అధికారులు తెలిపారు. వారంతా శిధిలాల ట్రాప్ లో చిక్కుకున్నారు.. ఇప్ప‌టికే శిధిలాల నుంచి 74 మృత‌దేహాల‌ను వెలికి తీశారు. ఇప్పటివరకు 146 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

కుప్ప‌కూలిన వంతెన

చురల్మల వద్దనున్న ఏకైక వంతెన, ప్రధాన రహదారి ధ్వంసమయ్యాయి. దీంతో 250మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ముండకై ఆవలవైపు సహాయక చర్యలు చేపడుతున్నారు. కొండ చ‌రియ‌లు విరిగిప‌డిన ప్రాంతానికి చేరుకునే మార్గంలో ఉన్న ప్ర‌ధాన‌మైన వంతెన కుప్ప‌కూల‌డంతో అక్క‌డికి స‌హాయ సిబ్బంది ఇబ్బంది ప‌డుతున్నారు.. ఈ నేప‌థ్యంలో రంగంలోకి దిగిన ఆత్య‌వ‌స‌ర వంతెన‌ను నిర్మించింది.. దీంతో ఇప్పుడిప్పుడే రెండో వైపు నుంచి కూడా స‌హాయ కార్య‌క్ర‌మాలు జోరందుకున్నాయి.

చుర‌ల్మ‌ల గ్రామం ధ్వంసం

కొండచరియల ఘటనలో చురల్మల గ్రామం కొంతభాగం డ్యామేజ్ అయింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ తరహా విపత్తు ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. కొండచరియలు విగిరిన ప్రాంతం ముండకైగా గుర్తించారు. ఈ ప్రాంతంలో తొలుత అర్థరాత్రి ఒంటిగంటకు, మళ్లీ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రెండుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. ఇక్కడ వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. చురల్మల పట్టణంలో కొంత భాగం తుడిచి పెట్టుకుపోయినట్లు సమాచారం. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వెల్లర్మల పాఠశాల పూర్తిగా నీట మునిగింది. మెప్పాడి ముండకైలో ప్రాంతంలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మెప్పాడి ముండకై ప్రాంతంలో ఇంత పెద్ద విపత్తును వయనాడ్ ఎన్నడూ చూడలేదని స్థానికులు తెలిపారు.

అర్ధరాత్రి వేళ విలయం..

ముండకైలో అర్ధరాత్రి ఒంటిగంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడ్డట్లు స్థానికులు వెల్లడించారు. 500కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం ఉన్నట్లు తెలిపారు. చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విపత్తుపై ఇంకా కచ్చితమైన అంచనాకు రాలేదని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని రెవెన్యూ మంత్రి కె.రాజన్ చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నారు. 16 మందికి మెప్పాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వంతెన కూలిపోవటంతో అత్తమల, చురల్‌మలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.

రంగంలోకి దిగిన ముఖ్య‌మంత్రి

ఈ ప్రమాద వార్త తెలిసిన వెంట‌నే ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వ‌యంగా రంగంలోకి దిగారు.. స‌హాయక చ‌ర్య‌ల‌ను స‌మ‌న్వ‌యం చేస్తున్నారు. కేరళ విపత్తు నిర్వహణ సంస్థ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నాయి. భారీ వర్షాల కారణంగానే కొండ చరియలు విరిగిపడినట్లు అధికారులు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను వినియోగిస్తున్నామని తెలిపారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ఇతరత్రా యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. ఇక ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించింది. అత్యవసర సహాయం కోసం 9656938689, 8086010833 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు ముఖ్య‌మంత్రి.

ఐదు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌

కేరళలోని ఐదు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. వీటిల్లో మల్లప్పురం, కోజీకోడ్‌, వయనాడ్, కసరగొడ్‌, కన్నూరు ఉన్నాయి. రానున్న 24 గంటల్లో ఇక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఎర్నాకులం, ఇడుక్కీ, త్రిశూర్‌, పాల్కడ్‌ జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

రంగంలోకి సైన్యం స్పెషలిస్టు బృందాలు

వయనాడ్‌లో సహాయక చర్యలు చేపట్టేందుకు కన్నూర్‌లోని డిఫెన్స్ సెక్యూరిటీ కోర్‌ నుంచి రెండు వరద సహాయక కాలమ్స్‌ను వయనాడ్‌కు తరలించారు. బెంగళూరు నుంచి ఆర్మీ ఇంజినీర్‌ కోర్‌ బృందం బయల్దేరింది. అది త్వరలోనే వయనాడ్‌ చేరుకోనుంది. కొండచరియల తొలగింపు, తాత్కాలిక నిర్మాణాల్లో వీరికి నైపుణ్యం ఉంది. మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ఆర్మీచీఫ్‌ ఉపేంద్ర ద్వివేదితో కేరళలోని పరిస్థితిపై చర్చించారు. ఇప్పటికే 122 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌కు చెందిన రెండు కాలమ్స్‌ వెళ్లినట్లు ఆర్మీ చీఫ్‌ పేర్కొన్నారు. మొత్తం 225 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

ఇది ఊహించ‌ని విప‌త్తు – రాష్ట్ర‌ప‌తి
ఇది ఊహించ‌ని విప‌త్తుగా అభివ‌ర్ణించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వయనాడ్‌లో ప్రాణనష్టం సమాచారం తీవ్రంగా బాధించింద‌ని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా అని అన్నారు.. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిచారు.

ప్ర‌ధాని విచారం

ఈ ప్ర‌మాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం విచారకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థించారు. ”సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌తో మాట్లాడాను. కేంద్రం నుంచి అందించగల అన్నిరకాల సహాయాలు చేస్తాము” అని పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందినవారికి పీఎం ఎన్‌ఆర్‌ఎఫ్‌ కింద రూ.2 లక్షలు పరిహారం చెల్లిస్తారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. క్షతగాత్రులకు రూ.50,000 ఇవ్వనున్నట్లు ఎక్స్‌లో పేర్కొంది.

మ‌న‌సును క‌లిచివేసింది..

మరోవైపు వయనాడ్‌ మాజీ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కూడా ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు. ”కేరళలోని వయనాడ్‌లో మెప్పాడి వద్ద కొండచరియలు విరిగిపడటం తీవ్ర విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. శిథిలాల కింద చిక్కుకొన్నవారిని త్వరలోనే సురక్షితంగా బయటకు తెస్తారని ఆశిస్తున్నా. కేరళ ముఖ్యమంత్రి, వయనాడ్‌ కలెక్టర్‌తో మాట్లాడాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారు చెప్పారు. ఏజెన్సీలతో సమన్వయం చేసుకొని కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేయాలని కోరాను. ఏదైనా సాయం అవసరమైతే మాకు తెలియజేయాలని సూచించాను. కేంద్ర మంత్రులతో మాట్లాడి సాయం చేయాలని కోరాను. ఇక యూడీఎఫ్‌ కూటమి కార్యకర్తలు అధికార యంత్రాంగానికి చేదోడువాదోడుగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను” అని ఆ సందేశంలో పేర్కొన్నారు.

యుద్ద ప్రాతిపాదిక న స‌హాయ చ‌ర్య‌లు…

శిధిలాల కింద ఉన్న‌వారిని రక్షించేందుకు ఆర్మీని కూడా రంగంలోకి దించిన‌ట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు యుద్ధ ప్రాతిపదికన గాలింపు, సహాయక చర్యలు చేపట్టాయ‌న్నారు.. ఇక రెండో బృందం కూడా బయల్దేరింద‌ని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement