బీజేపీ లీడర్లు చేస్తున్న క్షుద్ర రాజకీయాలు.. మతోన్మాద విధానాలకు ఇక్కడెవరూ తలవంచరని, తమ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోవడం కంటే చనిపోవడం మంచిదని భావిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని, వారికి 40 మంది ఎమ్మెల్యేలు అవసరమని, కొనుగోలు చేసేందుకు 800 కోట్లు ఏర్పాటు చేసుకుందని ఆరోపించారు.
– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
గురువారం సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఎక్సైజ్ పోలీసుల కేసులో సీబీఐ దాడులు జరిగిన మరుసటి రోజే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీఎం పదవి ఆఫర్ చేశారని అన్నారు. తనను పదవి నుంచి తప్పించాలని కోరారని ఆరోపించారు. ‘‘మనీష్ సిసోడియాకు బీజేపీ సందేశం పంపింది. ఆప్, అరవింద్ కేజ్రీవాల్ లను విడిచిపెట్టాలని కోరింది. మరికొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఆయనను బీజేపీలో చేరాలని వారు (బీజేపీ) కోరుకున్నారు. మనీష్ సిసోడియాకు ఢిల్లీ సీఎం పదవి ఆఫర్ చేశారు. ఆయనపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరించుకుంటామని కూడా చెప్పారు’’ అని కేజ్రీవాల్ అన్నారు.
‘‘మనీష్ సిసోడియా మాతో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. ఆయనకు సీఎం పదవిపై అత్యాశ లేదు. మనీష్ సిసోడియా లాంటి వ్యక్తి నాతో ఉన్నారంటే నేను నా గత జన్మలో మంచి పనులు చేసి ఉండాలి. ఇప్పుడు వారు (బీజేపీ) మా ఎమ్మెల్యేలను వెంబడించి, బీజేపీలో చేరడానికి డబ్బు ఆఫర్ చేస్తున్నారు. ఆప్ ను వీడి బీజేపీలో చేరేందుకు బీజేపీ రూ.20 కోట్లు ఆఫర్ చేస్తోందని నాకు వార్త అందింది. ఒక్క ఎమ్మెల్యే కూడా తమ ఆఫర్ ను అంగీకరించకపోవడం చాలా సంతోషంగా ఉంది’’ అని సీఎం కేజ్రీవాల్ అన్నారు. సిసోడియా నివాసం వద్ద పరుపులు, గోడలను కూడా సీబీఐ తనిఖీ చేసిందని, కానీ నేరారోపణలు చేసే ఆధారాలు లభించలేదని కేజ్రీవాల్ చెప్పారు.
ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ 2021-22లో అవకతవకలకు సంబంధించి సిసోడియా నివాసంతో సహా 31 చోట్ల సీబీఐ గత వారం దాడులు నిర్వహించింది. అయితే బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ చేపట్టిందని, అది విఫలం కావాలని కోరుకుంటూ కేజ్రీవాల్ సహా ఆప్ ఎమ్మెల్యేలంతా రాజ్ ఘాట్ కు వెళ్లి ప్రార్థించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను పార్టీ మారాలని బీజేపీ కోరిందని, అయితే ఆ ప్రతిపాదనను ఎమ్మెల్యేలు తిరస్కరించారని ఢిల్లీ అధికార పార్టీ ఆరోపించింది.