Thursday, November 21, 2024

Omicron concern: ఒమిక్రాన్‌పై కేజ్రీవాల్ ఆందోళన.. ప్రధానికి కీలక సూచన

క‌రోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు దేశాల‌కు వ్యాప్తి చెందిన ఈ వైరస్ పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వైరస్ ఇప్పటికే పలు దేశాలకు విస్తరించింది. కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ అత్యంత ప్రమాదకరమని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కీలక ట్వీట్ చేశారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపేయాల‌ని ప్రధాని మోదీని ఆయన కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంద‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఈ విష‌యంలో ఆలస్యం చేయకుండా అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని చెప్పారు.

ద‌క్షిణాఫ్రికా స‌హా ఒమిక్రాన్ కేసులు ఉన్న‌ దేశాల నుంచి ఇప్ప‌టికే అనేక దేశాలు విమానాల రాకపోకలను నిలిపి వేశాయని, మరి భార‌త్ ఎందుకు ఆలస్యం చేస్తోంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కరోనా మొదటి ద‌శ విజృంభ‌ణ స‌మ‌యంలో కూడా విమానాల రాకపోకలపై నిషేధం విధింపులో ఆలస్యం చేశామ‌ని కేజ్రీవాల్ గుర్తు చేశారు. అంతర్జాతీయ విమానాల్లో అధిక శాతం దేశ రాజధానిలో దిగడం వల్ల ఢిల్లీపై ఆ వైర‌స్ వ‌ల్ల‌ ఎక్కువగా ప్రభావితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పీఎం సారు దయచేసి విమానాల రాక‌పోక‌ల‌కు ఆపాల‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెంద‌కుండా  ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement