కేజ్రీవాల్ మరో టార్గెట్ పెట్టుకున్నారు. పంజాబ్‌లో ఘన విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌పై కన్నేశారు. గుజరాత్‌తో పాటు సింధియా, గెహ్లోత్ కోట అయిన రాజస్థాన్‌ను కూడా ఆయన టార్గెట్ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆప్ నిర్ణయించుకుంది. మార్చి 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు రాజస్థాన్‌లో సమావేశాలు నిర్వహిస్తామని ఎంపీ, ఆప్ రాజస్థాన్ ఇన్‌చార్జి సంజయ్ సింగ్ తెలిపారు. రాజస్థాన్‌లో రెండు రోజుల పాటు విజయ్ ఉత్సవ్ పేరిట సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆప్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగుతాయని నేతలు పేర్కొంటున్నారు.
ఢిల్లీ, పంజాబ్‌లో తమ ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలనా విధానాన్ని రాజస్థాన్ ప్రజలకు వివరిస్తామని, వారి ఆమోదం కోసం ప్రయత్నాలు చేస్తామని ఆప్ నేతలు పేర్కొంటున్నారు. అలాగే అతి త్వరలోనే సంస్థాగత పదవులపై కూడా దృష్టి పెడతామని, మొదట రాజస్థాన్ పార్టీ అధ్యక్షుడి ఎంపిక, ఆ తర్వాత ఇతరత్రా పదవుల గురించి ఆలోచిస్తామని చెబుతున్నారు. వీటితో పాటు రాజస్థాన్‌లో పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని, ఇంటింటా తిరుగుతూ.. తమ పార్టీ లక్ష్యాలను ప్రజలకు వివరిస్తామని ఆప్ నేత జాగిర్దార్ తెలిపారు.