ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి సమీపంలో ఊహించని రీతిలో సిలిండర్లు పేలి ముగ్గురు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలవడం బాధాకరమన్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో వున్న ఎంపీ నామా నాగేశ్వర్ రావులకు ఫోన్లు చేసి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. తాము అండగా వుంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.
కేటీఆర్ ఆవేదన…
చీమలపాడు ఘటనపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి ప్రభుత్వమే వైద్యసాయం అందిస్తుందని చెప్పారు. సంఘటన జరిగిన వెంటనే సిరిసిల్ల పర్యటనలో ఉన్న కేటీఆర్ వైరాలోని అధికారులతో మాట్లాడారు. ఘటన జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పార్టీ నేతలు, కార్యకర్తలు తగిన జాగ్రతలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.
హరీశ్ దిగ్భ్రాంతి :
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం ఘటనపై మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందటం బాధాకరమన్నారు. ఘటన గురించి తెలియగానే ఆరా తీసిన మంత్రి హరీశ్ రావు.. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సుపరింటెండ్ తో మాట్లాడి, అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రులను నిమ్స్ ఆసుపత్రికి తరలించి, అత్యున్నత వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు.