తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను 22 రోజుల పాటు సంబురంగా నిర్వహించిన తర్వాత పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు వార్తలు అందుతున్నాయి. ఇందులో భాంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇక.. ఇరత పార్టీలు ఊహించని రీతిలో, ఆయా పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతుండగానే బీఆర్ఎస్ పార్టీ మాత్రం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు స్పష్టమవుతోంది. ఇదంతా కేసీఆర్ రాజకీయ చాతుర్యంగా పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.
– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్‌కి సంబంధించిన నిర్ణయాన్ని మరో పది రోజుల్లోగా సీఎం కేసీఆర్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల జాబితాని రిలీజ్ చేయనున్నట్టు సమాచారం అందుతోంది. ఇక.. ఎట్లాంటి పొత్తులు లేకుండానే జనరల్ ఎలక్షన్స్‌కి వెళ్లేందుకు బీఆర్ఎస్ అధినేత, గులాబీ బాస్ కేసీఆర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈసారి 80 నుంచి 90శాతం సిట్టింగులకే చాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు రకాల సర్వేల ఆధారంగా గులాబీ బాస్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. వారం పది రోజుల్లోనే పూర్తిస్థాయిలో అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు కేసీఆర్ అంతా రెడీ చేసినట్టు తెలుస్తోంది.