Tuesday, November 26, 2024

మేమొస్తాం – మార్పు తెస్తాం … కెసిఆర్

సరికొత్త ఇరిగేషన్‌ పాలసీ తీసుకొస్తాం
ప్రతి ఎకరానికి నీళ్లిచ్చి సస్యశ్యామలం చేస్తాం
ఇంటింటికీ రక్షిత నీరు సరఫరా చేస్తాం
రాష్ట్రాల మధ్య జలయుద్ధాలుండవ్‌
పార్టీలు, నేతలు కాదు ప్రజలు గెలవాలి
చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరగాలి
ప్రజాసమస్యలు పరిష్కారమవ్వాలి
ఆ రెండు పార్టీలతో సాధ్యంకానిది బీఆర్‌ఎస్‌ చేసి చూపిస్తుంది
అందుకే ”అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌”
దేశ ప్రజలకు సీఎం కేసీఆర్‌ భరోసా
దేశంలో తెలంగాణ జనాభా కేవలం 3 శాతమే
అయినా, దేశ జీడీపీలో భాగస్వామ్యం 4.9 శాతం
దేశమంతా తెలంగాణ వెూడల్‌ అమలు చేస్తామంటూ హామీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతున్న దేశాన్ని ప్రగతిపథంవైపు నడిపించేం దుకే బీఆర్‌స్‌ పార్టీ ఆవిర్భవించిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. జాతి సంపదగా ఉన్న సహజ వనరులను పూర్తిస్థాయిలో సద్వి నియోగం చేసుకుని వ్యవసాయ రం గాన్ని దుస్థితి నుంచి బయటకు తీసుకు వస్తామన్నారు. ఆర్థిక వ్యవస్థను సుస్థిర పరిచే అన్ని అంశాలపై అధ్యయనం చేసి దేశ వ్యాప్తంగా సాగునీరు, తాగునీరు, విద్యుత్‌ అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామన్నారు. ప్రతి ఎకరానికి నీళ్లిచ్చి సస్యశ్యామం చేస్తామని ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రకటించారు. పుష్కలమైన జల వనరులు ఖనిజ సంపద కలిగివున్న కలిగి ఉన్న దేశంలో పార్టీలు, నేతలు కాదు.. ప్రజలు గెలవాలని ఆయన ఆకాంక్షించారు. చట్ట సభల్లో అర్థవంతమైన చర్చలు జరగా ల్సిన అవసరం ఉందని, మార్పులకు ఈ సభలు వేదికలు కావాలన్నారు. బీఆర్‌ ఎస్‌ అధికారంలోకి వస్తే ప్రజాసమస్యలు పరిష్కారమవ్వాలన్నదే పార్టీ అధినేతగా తన లక్ష్యమని చెప్పారు. ఇప్పటివరకు 75 సంవత్సరాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌, బీజేసీ పార్టీలతో సాధ్యంకానిది తాము చేసి చూపిస్తామని భరోసా ఇచ్చారు. దేశంలో వర్షపాతం ద్వారా ప్రతియేటా లక్షా 40వేల టీఎంసీల నీళ్ళు అందుబాటులో ఉంటే, అందులో 70వేల టీఎంసీల నీరు ఆవిరైపోతుందన్నారు. మిగిలిన 70వేల టీఎంసీల నీటిని వినియోగానికి అందుబాటులోకి తీసుకువస్తే భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. 20 యేళ్ళుగా నదీ జలాల కేటాయింపులపై ఎటూ తేల్చలేకపోతున్న ట్రిబ్యునళ్ళను తాము అధికారంలోకి వచ్చాక పాతరేస్తామన్నారు. రాష్ట్రాల మధ్య జలయుద్ధాలను పరిష్కరించి నీటి వాటాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. 32 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగివున్న మన దేశంలో 83 కోట్ల ఎకరాల భూమి ఉందన్నారు. అందులో 50శాతం అంటే 41 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఇవి తాము నోటిమాటగా చెప్పే లెక్కలు కాదని, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ జల మండలి లాంటి సంస్థలు అధ్యయనంలో లెక్కలు తేల్చాయని వెల్లడించారు. శుద్దమైన నదీ జలాలను దేశ్యాంప్తంగా తాగునీటి సమస్యలు తీర్చేందుకు వినియోగిస్తామన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వ్యవస్థను ఆవిష్కరించి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో భారీ పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పుతామని, అందుకు అన్ని అవకాశాలు, అనుకూల వాతావరణం మన దేశంలో ఉందని చెప్పారు. కేంద్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని, కొత్త జల విధానం ఖచ్చితంగా తీసుకొస్తామని ప్రకటించారు. ఐదారేళ్లలో ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ తరహాలో తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ”మన పిల్లలు పిజ్జాలు, బర్గర్లు తినాల్సిన అగత్యం ఏంటి.. దేశంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీక్రి ఎంతో అవకాశం ఉంది. అదానీ, అంబానీలకు కాదు. రైతుల పిల్లలకు అప్పులిస్తే అద్భుతాలు సృష్టిస్తారు” అని సీఎం పేర్కొన్నారు.

మళ్ళీ ఢిల్లి వెళ్తా… సాధించి తీరుతా
”తెలంగాణ గడ్డ మీద పుట్టినా.. నేను భారతీయుడిని. తెలంగాణ సహా దేశంలోని ప్రతి ఎకరానికి నీళ్లు రావాలని కోరుకునేవాడిని. వాక్‌ శుద్ధి, చిత్త శుద్ధి, సంకల్ప శుద్ధి ఉంటే.. తలచుకుంటే ఏదైనా సాధ్యమే ఉమ్మడి ఏపీ నుంచి ఢిల్లీ వెళ్లా.. తెలంగాణ సాధించే మళ్లీ వచ్చా.. కేంద్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుంది.. కొత్త జల విధానం తీసుకొస్తాం. జనాభా గణన చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీలు అడుగుతున్నారు. జనాభా లెక్కలు లేకుండా ఏ దేశంలోనూ పరిపాలన సాగదు” అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.
బండారం బయటపడుతుందనే జనగణనకు బ్రేక్‌
ప్రధాని నరేంద్రమోడీ కార్పొరేటు కుట్రలు బయటపడుతాయన్న భయంతోనే దేశంలో జనగననను నిలిపివేశారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. 1871నుంచి ఇప్పటి వరకు 140 ఏళ్లలో జనాభా గణన ఏ ఒక్కసారి కూడా ఆగలేదు. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోనూ జనాభా గణన ఆగలేదు. మరి ఇప్పుడు మోడీ ప్రభుత్వం జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు. జనాభా లెక్కలు జరిగితే బీజేపీ బండారం బయటపడుతుందని భయపడుతోందని ఆరోపించారు. జనాభా గణన చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీలు అడుగుతున్నారని తెలిపారు.
బీజేపీ కుట్రలు రాజేందర్‌కు తెలియదా?
కాళేశ్వరం, పాలమూరుపై ఎన్ని కుట్రలు చేశారో ఈటల రాజేందర్‌కు తెలియదా అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కుట్రలన్నీ ఛేదించి అనేక ప్రాజెక్టులు సాధించుకున్నామని తెలిపారు. ఇప్పుడు సాగులో పంజాబ్‌ను తలదన్నే పరిస్థితికి ఎదిగామని తెలిపారు. కాళేశ్వరం, పాలమూరుపై ఎన్ని కుట్రలు చేశారో తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. కుట్రలన్నీ ఛేదించి అనేక ప్రాజెక్టులు సాధించుకొని సాగులో పంజాబ్‌ను తలదన్నే పరిస్థితికి ఎదిగామని హర్షం వ్యక్తం చేశారు. నీళ్ల లెక్కలు తేల్చడం కాంగ్రెస్‌ వల్ల కాదు.. బీజేపీ వల్ల కాదు.. అందుకే బీఆర్‌ఎస్‌ను తీసుకొచ్చామని ప్రకటించారు. దెెశంలోని ప్రతిఎకరానికి నీళ్లు రావాలని కోరుకునేవాడినని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement