Wednesday, November 20, 2024

ఈటలకు ధీటైన టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు?

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అన్ని పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది. ఉపఎన్నికకు నోటిఫికేషన్ ఇంకా రాకపోయినా.. గెలుపు ఎవరిని వరిస్తుంది? అన్నది ఆసక్తిరేపుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉన్నా.. ఈటల వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా ఎన్నిక జరగనుంది. బీజేపీ నుంచి ఈటల ఉండగా.. టీఆర్ఎస్ అభ్యర్థిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారు? గులాబీ దళపతి మనసులో ఉన్న వ్యక్తి ఎవరు? అన్నది సస్పెన్స్ గా మారింది.

మరి కొద్ది రోజుల్లో ఉపఎన్నికను ఈసీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపికపై సీఎం కేసీఆర్‌ ఫోకస్‌ పెట్టారు. ఈటల రాజేందర్‌కు ధీటైన అభ్యర్థిని నిలబెట్టాలన్న సంకల్పంతో కసరత్తు చేస్తున్నారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో మంత్రులు హరీశ్‌ రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌తో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవల ప్రకటించిన దళితబంధుపై నియోజకవర్గ ప్రజల్లో జరుగుతున్న చర్చ గురించి కూడా ఆరా తీసినట్లు సమాచారం. పలు పార్టీల నేతల చేరికల అనంతరం పార్టీ పరిస్థితిపై ఇన్‌చార్జ్‌లను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

మాజీ మంత్రి ఈటల రాజీనామా అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థిపై చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారంటూ ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించాయి. అయితే కేసీఆర్ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. హుజురాబాద్ టికెట్ తనకే అంటూ ధీమాతో ఉన్న కౌశిక్ రెడ్డికి సైతం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. హుజురాబాద్ లో గెలుపు కోసం ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన నాయకులను గులాబీ గూటిలో చేర్చుకున్న కేసీఆర్.. తమ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలి అనేదానిపై విస్తృత చర్చలు జరుపుతున్నారు.

అయితే, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటలను ఓడించడం అంత సులువు కాదని కేసీఆర్ కు బాగా తెలుసు. ఎన్నికల్లో ఈటలను ఓడించడమే ప్రధాన అజెండాగా పెట్టుకున్న గులాబీ దళపతి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒవైపు సామాజిక సమీకరణలు, మరోవైపు అభివృద్ధి మంత్రంతో ఓట్లు రాబట్టాలని కేసీఆర్ యోచిస్తున్నారు.

మరోవైపు హుజురాబాద్ నియోకవర్గంలో ఈటల పాదయాత్రతో దూసుకుపోతున్నారు. దీంతో అభ్యర్థి విషయంలో ఇంకా ఆలస్యం చేయకూడదని కేసీఆర్ భావిస్తున్నారు. కౌశిక్ రెడ్డి సహా మరో నలుగు పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. గతంలో తెలంగాణ సెంటిమెంట్ తో పలు ఎన్నికల్లో గెలిచిన ఈటలకు ఇప్పుడు ఛాన్స్ లేదని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇన్నాళ్లు కేసీఆర్ ఫోటో చూసే ఈటలను గెలిపించారని చెబుతున్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ ఫోటో చూసే జనం ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద టీఆర్ఎస్ అభ్యర్థిని మరో వారం రోజుల్లో ఫైనల్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement